Pawan-Varahi
విధాత: ఏదైనా సినిమా విడుదల అయ్యాక వందరోజులు పూర్తి చేసుకుంటుంది. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో భారీ హైప్‌తో టీజర్ మాత్రమే బయటికి వచ్చిన ఒక పొలిటికల్ ఈవెంట్ మాత్రం అసలు బయటకు రిలీజ్ కాకుండానే వందరోజులు పూర్తి చేసుకున్నది. అవును.. నిజమే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, జగన్ను నిలదీస్తానని, ప్రజల మధ్యనే ఉంటానని చెప్పి భారీగా వారాహి పేరిట ప్రచార రథాన్ని సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ దాన్ని ఇంతవరకు రోడ్డు ఎక్కించలేదు.
జనవరి 24న ఆ ప్రత్యేక రథాన్ని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. పత్రికలకు, మీడియాకు వీడియోలు, ఫోటోలు విడుదల చేశారు.. మున్ముందు వారాహి ఆంధ్రాలో వీరవిహారం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు తప్పదని పవన్ హెచ్చరించారు.
దీని మీద వైసిపి సోషల్ మీడియా విరుచుకుపడడం.. అదంతా వేరే సంగతి కానీ జనవరి 24 నుంచి ఇప్పటికి వందరోజులు గడిచింది.. కానీ ఇంత వరకూ వారాహి రథం షెడ్ నుంచి బయటకు రాలేదు. దాన్ని పవన్ఎ క్కడ దాచారో… ఎప్పుడు మరి జమ్మి చెట్టుమీది ఆ ఆయుధాన్ని కిందికి దించి యుద్ధానికి వస్తారో తెలియని పరిస్థితి. ఇక దీన్ని సైతం మళ్ళీ వైసిపి సోషల్ మీడియా అందుకుంది.
వంద రోజులు గడిచింది.. ఇంకెప్పుడు బయటకు తెస్తావ్ పవన్ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆమధ్య చంద్రబాబుతో పొత్తు చర్చలు జరిపారు. అవి సరిగ్గా కుదిరితే పొత్తు ఫిక్స్ అయినట్లు.. పవన్‌కు దాదాపు పాతిక వరకూ ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చి, ఓ మూడు నాలుగు ఎంపీ టికెట్స్ ఇచ్చి ఉమ్మడిగా జగన్ను ఎదుర్కొంటారని అంటున్నారు.
పొత్తు కుదరడం, ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తారో ఒక క్లారిటీ వస్తే తప్ప వారాహి మళ్ళీ రోడ్ల మీదకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అందాకా షెడ్‌కు పరిమితమైన ఆ భారీ వాహనం ప్రస్తుతానికి వైసిపి సోషల్ మీడియా వాళ్లకు ఒక న్యూస్ ఐటెంగా మిగిలింది.