సీఎం కేసీఆర్ మాట్లాడుతుండ‌గా లేచి వెళ్లిపోతున్న జ‌నం

సీఎం కేసీఆర్ మాట్లాడుతుండ‌గా లేచి వెళ్లిపోతున్న జ‌నం

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఉద్యమ సమయంలో కేసీఆర్ బహిరంగ సభలు అంటే అదో క్రేజ్ వేలాది కిలోమీటర్ల నుండి తరలివచ్చి ప్రసంగం ముగిసే వరకు ఆసక్తితో తిలకించేవారు. ట్రాఫిక్ లో చిక్కుకుని సభాస్థలి వద్దకు వెళ్లలేకపోతే రోడ్డుపైనే వినేవారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరొందిన వక్త ఆయన ప్రసంగం కోట్లాదిమందిని మంత్రముగ్ధులు చేసేది. ఆయన మాట్లాడుతుంటే కదలకుండా వినేవారు. కాని దానికి విరుద్ధంగా నేడు మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో బీఆరెస్‌ పార్టీ చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగానే అక్క‌డి నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా నిష్క్రమించడం (వెళ్లిపోవడం) చర్చనీయాంశంగా మారింది.



సీఎం కేసీఆర్ ప్రసంగంలో క్రేజ్ తగ్గిందా? పదును తగ్గిందా ? మూస ధోరణిలో ప్రసంగాలు ఉంటున్నాయా ? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పై రోజురోజుకు తగ్గుతున్న విశ్వాసమా ? కేసీఆర్ మాటలకు ఆయన చేపడుతున్న పనులకు పొంతన లేదని ప్రజలు భావిస్తున్నారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది .


కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే మహా అద్భుతం అని చెప్పిన బీఆరెస్ అధినేత కేసీఆర్ నిర్మించిన నాలుగేళ్లకే కుంగిపోవడం కళ్ల‌ ముందే కనిపిస్తున్న తరుణంలో ప్రజలు ఆయ‌న‌ ఉపన్యాసాలను విశ్వసిస్తాలేరా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రజల మన్ననలను పొందులేకపోతున్నాయా ? ఉద్యోగాల కోసం వేచి చూసిన నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు కేసీఆర్ మాటలు నమ్మశక్యంగా లేవని నిర్ధారించుకుంటున్నారా ? అని విశ్లేషకులు భావిస్తున్నారు.