Pilli Subhash |
విధాత: పిల్లి సుభాష్ చంద్రబోస్ .. మొదటి నుంచీ జగన్ వెంట నడిచి, జగన్ కోసం ఆనాడు మంత్రిపదవిని సైతం వదులుకున్న నాయకుడు ఇప్పుడు పార్టీలో ఉంటారా ? బయటకు వెళ్తారా? చూడాలి. రామచంద్రాపురం నుంచి గతంలో పోటీ చేసి గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ తరువాత రెండుసార్లు ఓడిపోవడం, ఈలోపు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వచ్చి ఈ రామచంద్రాపురాన్ని ఆక్రమించుకోవడంతో పాపం పిల్లి ఆత్మరక్షణలో పడిపోయారు.
అంతేకాకుండా తనను రాజ్యసభకు పంపడం ద్వారా తనను స్థానిక నియోజకవర్గానికి దూరం చేశారనే బాధ ఉన్న పిల్లి ఇప్పుడు మళ్ళీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ ఆయన మళ్ళీ గెలుస్తారో లేదో అనే నమ్మకం లేని జగన్ ఇప్పుడున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారన్న సమాచారం ఉన్న సుభాష్ తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.
అంతేకాకుండా ఈసారి తనకు టికెట్ ఇవ్వకపోతే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఒంటరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని గట్టి ప్రకటన చేసారు. ఇదిలా ఉండగా గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ మిథున్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు సుభాష్ చంద్రబోస్ తో మాట్లాడారు.. అయినా అయన చల్లబడక పోవడంతో ఇక నేరుగా జగన్ వద్దనే తేల్చుకునే పరిస్థితి నెలకొంది. దీంతో ఇందాక మళ్ళీ సుభాష్ చంద్రబోస్ ను అమరావతి పిలిపించుకున్న మిథున్ రెడ్డి, ఇంకా పార్టీ పెద్దలు మళ్ళీ సుభాష్ తో మాట్లాడారు.. తన గౌరవం ప్రమాదంలో పడిందని భావిస్తున్న సుభాష్ పార్టీని వీడతారని పుకార్లు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా సుభాష్ కుమారుడికి రామచంద్రపురం టికెట్ ఇవ్వడానికి జనసేన నుంచి హామీ వచ్చిందని , ఈ నేపథ్యంలోనే అయన వైసిపిని వీడాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే ఇప్పుడే ఏదీ చెప్పలేమని, పార్టీ తరపున సర్వే చేపట్టి ఎవరికీ ప్రజామద్దతు ఉంటే వాళ్ళకే టికెట్ ఇస్తాం అని జగన్, పార్టీ ముఖ్యులు సుభాష్ కు చెప్పి పంపించినట్లు తెలుస్తోంది.