LK Advani | బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారత రత్న

బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే. అద్వానీని కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించింది

LK Advani | బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారత రత్న
  • సుదీర్ఘ ప్రజాసేవకు దక్కిన అత్యున్నత పురస్కారం


LK Advani | విధాత: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే. అద్వానీని కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో ఆడ్వానీ పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీజిని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నామని, ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని మోడీ ప్రశంసించారు.


క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారని, పార్లమెంట్‌లో ఆయన అనుభవం మనకు ఎన్నటికీ ఆదర్శప్రాయమన్నారు. ఆద్వానీజి సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చని, జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారన్నారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం, పనిచేసే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తానని మోడీ ట్వీటర్‌లో పేర్కోన్నారు.


నిబద్ధత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం


లాల్ కృష్ణ ఆడ్వానీ 1927 నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీలో జన్మించారు. అక్కడే సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్లోని హైదరాబాద్ గల డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను పూర్తి చేశారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెఎస్‌ఎస్‌లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వహించారు.


దేశ విభజన అనంతరం అద్వానీ కుటుంబం భారత్‌కు వలసివచ్చింది. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్ గా అద్వానీ పనిచేశారు. 1957లో దిల్లీకి వెళ్లి జన్‌సంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు. 1970-72 లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. అర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు.


రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లోకి..


1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టారు. 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977- 79 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మూడుసార్లు పనిచేశారు.


బీజేపీ స్థాపకుడిగా ప్రస్థానం


1980లో అద్వాణీ సహా కొంతమంది జన సంఘ్‌ను వీడి అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌తో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 18 రోజులకే ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవ్వడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీ నగర్ నుంచి గెలుపొందారు. అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.