విధాత: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ అధినేత ఆదేశాల మేరకు వేటు వేసిన తర్వాత ఆ ఇద్దరి నేతలపై అధికారపార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు దాడి మొదలుపెట్టారు. కొన్ని నెలలుగా బీఆర్‌ఎస్ పార్టీ పెద్దల వైఖరిపై అసంతృప్తితో ఉన్న పొంగులేటి తన అనుచరులతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాని నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
ఆ వేదిక నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేతపైనే నేరుగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ నేతలెవరూ ఇంతకాలం స్పందించలేదు. నిన్న అధినేత ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి, జూపల్లిపై ఫైర్ అవుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి ఒకే వేదికపైకి రావడం పట్ల రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. వాళ్లు కొత్త పార్టీ పెడుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి.
అయితే వీటిని జూపల్లి కృష్ణారావు కొట్టి పారేశారు. పొంగులేటి కూడా స్వతంత్రంగానే ఉంటాను అని ప్రకటించారు తప్పా ఫలనా పార్టీలోచేరుతానని గాని, మరో పార్టీ పెడుతానని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇద్దరి నేతల టార్గెట్ మాత్రం కేసీఆరే అని స్పష్టమైంది. అందుకే మొన్న జూపల్లి తెలంగాణను దోచుకున్నది చాలక దేశాన్ని దోచుకోవడానికే బీఆర్‌ఎస్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.
పొంగులేటి మాదిరిగానే తనపై మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పదవులు లేకున్నా…. మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకున్నా ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించానని అన్నారు. నా సహకారం వల్లనే రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యాయి అన్నారు. కేసులతో తన అనుచరులను ఇబ్బందులు పెట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ సహా అందరికీ సమస్యలు వివరించినా పట్టించుకోలేదన్నారు.
నేను ఇప్పుడు ఎక్కడ కనిపించినా కేసులు పెడుతున్నారు. తాను తలవంచనని, జనమే సర్కారు మెడలు వంచుతుందని జూపల్లి ఘాటుగా హెచ్చరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 బీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎవరినీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని శపథం చేశారు.
ఈ రెండు జిల్లాలో బీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తాయి అన్న నేతల మాటల ఆంతర్యాన్ని నిశితంగా గమనిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి తప్పా మరోపార్టీకి ఆ అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మొత్తం స్థానాలు గెలిపించే బాధ్యతను తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అలాగే తాను వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని అన్నారు.
ఖమ్మం జిల్లాలోనూ గత ఎన్నికల్లో పదింటిలో 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మినహా మిగిలిన 5 గురు బీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్లు గెలిచింది బీఆర్‌ఎస్ అభ్యర్థులపైనే. వాళ్ల చేరిక తర్వాత ఓడిపోయిన బీఆర్‌ఎస్ నేతలనూ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్లంతా పొంగులేటి వెంట నడుస్తున్నారు.
ఈ లెక్కన ఇద్దరు నేతలు సొంతపార్టీ పెట్టడం లేదని స్పష్టం చేయడమే కాకుండా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్‌వైపే అడుగులు వేస్తున్నారని సమాచారం. అందుకే అధికారపార్టీ నేతలు వీరిద్దరిపై వేటు పడగానే విరుచుకుపడుతున్నారని అంటున్నారు.