Priyanka Gandhi |
విధాత: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణపై కేంద్రీకరించినట్లు తెలిసింది. తెలంగాణపై ఫోకస్ పెట్టి పని చేయాలని పార్టీ అధిష్ఠానం ఆమెకు సూచించినట్టు తెలుస్తున్నది. ఇందిరాగాంధీ మనుమరాలిగా ప్రజల్లో ప్రియాంకకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ప్రియాంక తెలంగాణకు రావాలని కోరుతున్నారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నీ తానై నిలిచిన ప్రియాంక గాంధీ అక్కడ పార్టీని గెలిపించిందని పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న నేతలు ప్రియాంకను ఎన్నికల వరకు తెలంగాణపై కేంద్రీకరించాలని కోరినట్లు తెలిసింది.
దీంతో తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణాన్నిఓట్లుగా మార్చుకొని అధికారంలో రావడానికి వీలుగా ప్రియాంక గాంధీని తెలంగాణకు పంపించాలన్న నిర్ణయంతో పార్టీ జాతీయ నాయకత్వం ఉందని, అందుకే తెలంగాణపై కేంద్రీకరించాలని ఆమెకు సూచించిందని సమాచారం.
బాధ్యత చేపట్టేందుకు అంగీకరించిన ప్రియాంక.. తెలంగాణలోని అన్ని జిల్లాలు పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆమె త్వరలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికలు కూడా ఆమె సమక్షంలోనే ఉండొచ్చని తెలుస్తున్నది.