CM Revanth Reddy: ప్రజా ఆకాంక్షలే ఎజెండాగా తెలంగాణ పునర్ నిర్మాణం !

తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం
మహిళాభ్యున్నతికి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలు
రైతు సంక్షేమానికే రుణమాఫీ..బోనస్
యువత ప్రగతికి 16నెలల్లోనే 60వేల ఉద్యోగాలు
కులగణన..బీసీ రిజర్వేషన్లు..ఎస్సీ వర్గీకరణతో దేశానికే రోల్ మోడల్
భూ యజమానులకు భరోసాకే భూభారతి
విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు
ప్రపంచ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి
ఫ్యూచర్ సిటీ..రీజనల్ రైల్ తో పాటు మెట్రో రైల్ విస్తరణ
వన్ ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ సాధనకు ప్రణాళికలు
రాష్ర్ట అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలనే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ముందడుగు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్వేచ్ఛ,సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టామని..పదేళ్లలో నిర్వీర్యమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలను..జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉందని..ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ సమాజం కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకిరీని సహించదని..అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళుతున్నామన్నారు. గత పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించామని.. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నామని.. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు సహకారం అందించాలని కోరారు.
మహిళాభివృద్ధికి ఏడాదిలో రూ.21వేల కోట్ల రుణాలు
తెలంగాణ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని.. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామన్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామని, దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలామహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామని తెలిపారు. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా..ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టామని.. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించామని.. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలా మారి సగర్వంగా నిలబడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రైతు సంక్షేమానికే రుణమాఫీ, బోనస్, భరోసా పథకాలు
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని..ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేవలం ఎనిమిది నెలల్లో 25లక్షల, 35వేల,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నాం. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నామని తెలిపారు. వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని… దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు. దీంతో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్రవ్యాప్తంగా 8వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్త్నున్నాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని వివరించారు.
16నెలల్లోనే 60వేల ఉద్యోగాలు
యువతే మన భవిష్యత్తుగా భావించి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాం. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వైద్యరంగంలో, పోలీస్, నీటిపారుదల, సింగరేణి కాలరీస్, ఇలా వివిధ రంగాలలో ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు సహాయంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
విద్య వైద్య రంగాల ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలల్లో విద్య ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ను నియమించామని,.. మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్ ను ఆదేశించామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని.. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్ లో మెస్ చార్జీల సమస్యను పరిష్కరించామని.. గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలను నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రేవంత్ రెడ్ది వివరించారు.
కులగణన..బీసీలకు 42శాతం..ఎస్సీ వర్గీకరణ అమలులో దేశానికే రోల్ మోడల్
రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాలలో 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుని..కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపామన్నారు. శాస్త్రీయ కులగణనతో బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చామని..దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీసుకుని..శాసనసభ,శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నామని తెలిపారు. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణలోకులగణన చేపట్టేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలవర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించాం.ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4 ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరపాలని నిర్ణయించామని గుర్తు చేశారు.
పేదలకు అండగా సంక్షేమ పథకాలు
పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని సీఎం రేవంత రెడ్డి తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. నిజమైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాం. ఎంపిక చేసిన కొంతమందికి తొలి దశలో లక్ష రూపాయలు చెల్లించాం. మే 20 నాటికి 5,364 ఇందిరమ్మ లబ్దిదారులకు 53కోట్ల 64లక్షల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేశామని వివరించారు.
పేదల ఆకలి తీర్చడమే కాదు, వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఇది విప్లవాత్మక మార్పు. ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేను సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేశాను. ఆ రోజు వారి కళ్లలో చూసిన ఆనందం నా గుండెల్లో ఎప్పటికీ నిలిపోతుందన్నారు.
పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ
పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దావోస్, సింగపూర్,జపాన్ లాంటి దేశాల్లో పర్యటించిఇప్పటి వరకు 3లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్.సీ.ఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ లో ఇదొక తొలి మెట్టు అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నగరాలకు ధీటుగా హైదరాబాద్ ను తీర్చదిద్దేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును చేపడుతున్నాం. బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం.
రీజనల్ రైల్ తో పాటు మెట్రో రైల్ విస్తరణ
హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు 18వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. రీజనల్ రైల్ తో పాటు మెట్రో రైల్ విస్తరణ చేపడుతున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూ.24వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మామునూరు విమానావ్రయం పునరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించామని తెలిపారు.
మిస్ వరల్డ్ తో టూరిజం విస్తరణకు బాటలు
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించడం ద్వారా తెలంగాణ జరూర్ ఆనా అంటూ టూరిజం అభివృద్ధికి బాటలు వేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. వందకు పైగా దేశాల నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో‘భారత్ సమ్మిట్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ను అంతర్జాతీయ వేదికగా మార్చాం. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారని తెలిపారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గారు అందించిన అలీన విధాన స్ఫూర్తితో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమ్మిట్ లో చర్చించాం. భారత్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖను మరింత పటిష్టపరిచామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపేందుకు చర్యలు తీసుకున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ గా నిలిచింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి దుబాయ్ లో అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇది మనకు ఎంతో గర్వకారణమన్నారు.
దేశ రక్షణ, సమగ్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలుస్తున్నాం. పహల్గామ్ దాడుల ఘటనలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
వన్ ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ సాధనకు ప్రణాళికలు
2047 నాటికి భారత దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతుందని.. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణ రైజింగ్-2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిద్దాలని నిర్ణయించాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇందుకు తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం అని పేర్కొన్నారు. 2047నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు.