Rahul Gandhi | మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారు: రాహుల్‌గాంధీ

Rahul Gandhi | బీజేపీ సభ్యులు దేశభక్తులు కాదు.. దేశ ద్రోహులు మణిపూర్‌ను దేశ అంతర్భాగంగా భావించని మోదీ ఆర్మీని రంగంలో దించేందుకు ఇష్టపడని కేంద్రం మీ రాజకీయాల వల్లే మణిపూర్‌ తగలబడుతున్నది ఇప్పుడు హర్యానాలోనూ అదే పని చేస్తున్నారు అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తన సభ్యత్వ పునరుద్ధరణపై స్పీకర్‌కు కృతజ్ఞతలు రాహుల్‌ ప్రసంగం సమయంలో సభలో లేని ప్రధాని న్యూఢిల్లీ: బీజేపీ రాజకీయాలు మణిపూర్‌లో భారత మాతను బలిగొన్నాయని కాంగ్రెస్‌ సభ్యుడు రాహుల్‌గాంధీ […]

  • Publish Date - August 9, 2023 / 12:52 AM IST

Rahul Gandhi |

  • బీజేపీ సభ్యులు దేశభక్తులు కాదు.. దేశ ద్రోహులు
  • మణిపూర్‌ను దేశ అంతర్భాగంగా భావించని మోదీ
  • ఆర్మీని రంగంలో దించేందుకు ఇష్టపడని కేంద్రం
  • మీ రాజకీయాల వల్లే మణిపూర్‌ తగలబడుతున్నది
  • ఇప్పుడు హర్యానాలోనూ అదే పని చేస్తున్నారు
  • అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ
  • తన సభ్యత్వ పునరుద్ధరణపై స్పీకర్‌కు కృతజ్ఞతలు
  • రాహుల్‌ ప్రసంగం సమయంలో సభలో లేని ప్రధాని

న్యూఢిల్లీ: బీజేపీ రాజకీయాలు మణిపూర్‌లో భారత మాతను బలిగొన్నాయని కాంగ్రెస్‌ సభ్యుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికార బీజేపీ సభ్యులు ద్రోహులని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న మణిపూర్‌లో పర్యటించని ప్రధాని మోదీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మణిపూర్‌ భారతదేశంలో భాగం అని భావించడం లేదని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో రెండో రోజు రాహుల్‌ ప్రసంగించారు.

‘కొద్ది రోజుల క్రితం నేను మణిపూర్‌ వెళ్లాను. మన ప్రధాని అక్కడికి వెళ్లలేదు. ఇప్పటికీ ఆయన వెళ్లలేదు. మణిపూర్‌ రాష్ట్రం భారతదేశంలో భాగమని ప్రధాని అనుకోవడం లేదు. వాస్తవానికి మణిపూర్‌ అన్నది లేదు. మీరు మణిపూర్‌ను రెండు ముక్కలు చేశారు. మణిపూర్‌ను చీల్చారు’ అని రాహుల్‌ అన్నారు. తాను మణిపూర్‌ వెళ్లి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న మహిళలను, చిన్నపిల్లలను కలుసుకున్నానని, కానీ ప్రధాన మంత్రి మాత్రం ఆ పని చేయలేదు. రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీ సభలో లేరు.

ఓ తల్లి కళ్ల ముందే ఆమె బిడ్డను చంపారు

‘మీకే జరిగిందని నేను ఒక మహిళను అడిగాను. ‘నా కళ్లముందే నా పసిబిడ్డను కాల్చి చంపారు. నా కొడుకు శవాన్ని దగ్గర పెట్టకుని రాత్రంతా గడిపాను. నాకు భయం వేసింది. నేను నా ఇంటి నుంచి పారిపోయాను’ అని ఆమె తెలిపారు. వెంట ఏమన్నా తెచ్చుకున్నారా? అని అడిగితే.. కట్టుబట్టలతో బయటపడ్డానని, ఒక ఫొటో మాత్రం తెచ్చుకున్నానని తెలిపారు’ అని రాహుల్‌ గాంధీ వివరించారు.

‘మరో శిబిరంలో మరో మహిళను ఇదే ప్రశ్న అడిగాను. ఆ వెంటనే ఆమె వణికిపోతూ.. సొమ్మసిల్లి పడిపోయింది’ అని చెప్పారు. ‘ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇవి రెండు ఉదాహరణలు. మణిపూర్‌లో హిందూస్థాన్‌ను వాళ్లు (బీజేపీ) చంపేశారు. మణిపూర్‌లో వాళ్ల రాజకీయాలు మణిపూర్‌నే కాదు.. మొత్తం హిందూస్థాన్‌ను హత్య చేశాయి.

మణిపూర్‌లో హిందూస్థాన్‌ హత్యకు గురైంది. మణిపూర్‌లో ప్రజలను చంపడం ద్వారా మీరు భారత మాతను హత్య చేశారు. మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు’ అని బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్‌ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదానికి, ఇతర సమస్యలకు కాంగ్రెస్సే కారణమంటూ కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మండిపడ్డారు. అధికార పక్షం నుంచి అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా రాహుల్‌ తన ఉపన్యాసాన్ని కొనసాగించారు.

ఆర్మీని దించితేనే మణిపూర్‌లో శాంతి

ఆర్మీని రంగంలోకి దించితేనే మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘మీరు భారతదేశ గొంతును చంపేశారంటే.. దాని అర్థం.. మణిపూర్‌లో మీరు భారత మాతను హత్య చేశారని. (సభలో ఉన్న సోనియాగాంధీని చూపిస్తూ..) నా తల్లి ఇక్కడ కూర్చొని ఉన్నారు.

మరో తల్లి భారత మాతను మీరు మణిపూర్‌లో మీరు హత్య చేశారు’ అని నిప్పులు చెరిగారు. ‘అన్ని చోట్లా మీరు కిరోసిన్‌ చల్లారు. మణిపూర్‌ను మీరు తగులబెట్టారు. ఇప్పుడు హర్యానాలోనూ అదే పని చేస్తున్నారు’ అని చెప్పారు. రావణుడు ఇద్దరి మాటలే వినేవాడన్న రాహుల్‌.. ప్రధాని కేవలం అమిత్‌షా, గౌతం అదానీ.. ఈ ఇద్దరి మాటలే వింటారని విమర్శించారు. దాదాపు 30 నిమిషాలపాటు ఆయన మాట్లాడారు.

సభ్యత్వ పునరుద్ధరణపై స్పీకర్‌కు కృతజ్ఞతలు

తొలుత తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు స్పీకర్‌ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘చివరిసారి నేను మాట్లాడినప్పుడు మీకు కూడా బాధ కలిగించాను. అదానీ గురించి గట్టిగా ప్రస్తావించినందుకు మీ సీనియర్‌ నాయకులకు కూడా కష్టం అనిపించింది. అది కూడా మిమ్మల్ని బాధించి ఉంటుంది. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’ అని రాహుల్‌ చెప్పారు. నేను నిజమే మాట్లాడాను.

నా బీజేపీ మిత్రులు.. భయపడాల్సిన పనిలేదు. ఈ రోజు నేను మీ మీద దృష్టిసారించడం లేదు. రూమీ చెబుతాడు.. ‘హృదయం నుంచి వచ్చే మాటలు.. హృదయంలోకి వెళతాయి’. నేను మీపై ఎక్కువగా దాడి చేయను. తాను కన్యాకుమారి తీరం నుంచి కశ్మీర్‌ మంచుకొండల వరకు నడిచానని చెప్పారు. ఈ యాత్ర ముగియలేదన్నారు.

యాత్ర ఏ లక్ష్యంతో చేస్తున్నరని తనను చాలామంది ప్రశ్నించారన్న రాహుల్‌.. ‘ఎందుకు నడవాలనుకున్నానో నాకు తెలియదు. కానీ.. కొంతకాలానికి.. నేను ప్రేమించిన దానిని, నేను చనిపోవడానికి సిద్ధపడింది.. మోదీ జైలుకు వెళ్లేందుకు సిద్ధపడింది.. పదేళ్లుగా నేను ఎందుకు అవమానాలకు గురవుతున్నది అర్థం చేసుకునేందుకు నడుస్తున్నానని నాకు అర్థమైంది’ అని రాహుల్‌ వివరించారు. రాహుల్‌ ప్రసంగిస్తున్న సమయంలో అనేక మంది రాజ్యసభ సభ్యులు గ్యాలరీలో కూర్చొని ఉండటం కనిపించింది.