RajBhavan | రాజ్ భవన్ ఎట్ హోమ్‌కు.. సీఎం కేసీఆర్ మళ్లీ డుమ్మా

RajBhavan సీఎస్‌, డీజీపీల హాజరు.. కానరాని మంత్రులు, బీఆరెస్ ఎమ్మెల్యేలు తాను ఆహ్వానించినా.. సీఎం రాలేదన్న గవర్నర్‌ తమిళ సై కొనసాగుతున్న రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ప్రచ్చన్న యుద్దం విధాత: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆనవాయితీగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం తేనేటి విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉన్నారు. రాజ్‌భవన్ ఎట్ హోంకు వరుసగా సీఎం కేసీఆర్ మూడోసారి గైర్హాజరయ్యారు. చివరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు […]

RajBhavan | రాజ్ భవన్ ఎట్ హోమ్‌కు.. సీఎం కేసీఆర్ మళ్లీ డుమ్మా

RajBhavan

  • సీఎస్‌, డీజీపీల హాజరు.. కానరాని మంత్రులు, బీఆరెస్ ఎమ్మెల్యేలు
  • తాను ఆహ్వానించినా.. సీఎం రాలేదన్న గవర్నర్‌ తమిళ సై
  • కొనసాగుతున్న రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ప్రచ్చన్న యుద్దం

విధాత: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆనవాయితీగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం తేనేటి విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉన్నారు. రాజ్‌భవన్ ఎట్ హోంకు వరుసగా సీఎం కేసీఆర్ మూడోసారి గైర్హాజరయ్యారు. చివరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కేవలం సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లు మాత్రం హాజరయ్యారు.

అటు తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య నేతల హడావుడి కూడా ఈ సారి కనిపించలేదు. సీఎం గైర్హాజర్‌పై గవర్నర్ తమిళ సై స్పందిస్తు తాను తేనేటి విందుకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, అయితే సీఎం రావడం, రాకపోవడం రాజ్ భవన్ పరిధిలో లేదన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వైఖరి తనను తీవ్రంగా బాధించిందని, గవర్నర్ల పై సీఎంల తీరు ఇలా ఉండటం ఎప్పటికి మంచిదికాదన్నారు.

గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు మధ్య విబేధాల నేపధ్యంలో రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య సాగుతున్న ప్రచ్చన్నపోరు నేపధ్యంలో ఎట్‌హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారో లేదోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మూడోసారి కూడా కేసీఆర్ గైర్హాజర్ కావడం ద్వారా గవర్నర్ పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనూ ఆర్టీసీ విలీన బిల్లు వివాదంపై గవర్నర్‌ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదిక కూడా గవర్నర్‌పై సెటైర్లు వేశారు. రాజ్‌భవన్‌, ప్రగతి భవన్ మధ్య సాగుతున్న వైరం నేపధ్యంలో గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లుల పరిస్థితి ఏమిటన్నదానిపై ఉత్కంఠ కొనసాగనుంది.

గవర్నర్ గతంలో తిప్పి పంపిన బిల్లులు మూడింటితో పాటు కొత్తగా అసెంబ్లీ ఆమోదించిన ఎనిమిది బిల్లులతో కలిపి మొత్తం 12బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్ కోటాలోని ఇద్దరి ఎమ్మెల్సీల ప్రతిపాదనలు సైతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు సాగుతున్న ప్రచ్చన్న యుద్దంలో ఆ బిల్లులకు ఎప్పటిలోగా ఆమోదం లభిస్తుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.