వైసీపీకి సంకటంగా రాజ్యసభ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి.

  • Publish Date - January 26, 2024 / 04:50 PM IST
  • టీడీపీ పంచన రెబెల్ ఎమ్మెల్యేలు
  • వారిపై అనర్హత వేటుకు వేగంగా పావులు
  • ఆగమేఘాలపై స్పీకర్ కార్యాలయం నోటీసులు
  • ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదం
  • మూడు స్థానాల్లో వైసీపీకి ఒకటి చేజారే అవకాశం?
  • గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తప్పిన వైసీపీ లెక్కలు

విధాత, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ పదవీకాలం ముగియనుంది. వీటిని తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ, టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. సంఖ్యా బలంపరంగా చూస్తే ఈ 3 రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది.


అయితే ఆపార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో.. రెబెల్ ఎమ్మెల్యేలంతా టీడీపీ వైపు వెళ్తే.. వైసీపీ ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ అధినాయకత్వం అప్రమత్తమవుతోంది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి వైసీపీ తరపున ఎన్నికయ్యారు. వీరు అధిష్టానంతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటూ.. టీడీపీకి టచ్ లో ఉంటున్నారు. ఈక్రమంలోనే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు వైసీపీ అధిష్టానం తేల్చింది. అప్రమత్తమైన పార్టీ పెద్దలు గీత దాటిన తమ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.


మరోవైపు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్‌, సీ రామచంద్రయ్య వైసీపీకి గుడ్‌ బై చెప్పారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపైనా వైసీపీ కన్నెర్రజేస్తోంది. మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజుకు ఫిర్యాదు చేసింది. జనసేనలో వంశీ కృష్ణ యాదవ్‌, టీడీపీలో సీ రామచంద్రయ్య చేరిపోయారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. సీటు దక్కని మరికొందరు సిటింగ్‌ల్లో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలకు టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే… టీడీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌, వల్లంభనేని వంశీ టీడీపీ తరపున గెలిచి, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ స్పీకర్‌ కు ఫిర్యాదు చేసింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.

– క్రాస్ ఓటింగ్ పై వైసీపీ అలర్ట్

రాజ్యసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా జెండా ఎగరేసింది. బలం లేకపోయినా ఆమె విజయం సాధించింది. దీంతో వైసీపీ లెక్కలు తప్పాయి. కచ్చితంగా గెలుస్తామనుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడంతో వైసీపీ షాక్ అయ్యింది. మరోసారి అలాంటివి చేదు ఫలితాలు రాకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా అలర్ట్ అయ్యింది.

టీడీపీ బలాన్ని తగ్గించే వ్యూహం


టీడీపీ సభ్యుల బలాన్ని తగ్గిస్తే రాజ్యసభ ఎన్నికల్లో సులభంగా గెలుపొందవచ్చని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా గంటా రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది. 3 క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ పంపితే ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల ఫిర్యాదులపైనా స్పీకర్‌ చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డిలపై త్వరలో వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే టీడీపీ అభ్యర్థికి పడే ఓట్లు తగ్గిపోతాయ్‌. ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వైసీపీ పని చేస్తోందని చర్చ నడుస్తోంది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే… టీడీపీ సంఖ్యా బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

-29న అనర్హత పిటిషన్ల విచారణ


వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల భవితవ్యం శాసనసభ స్పీకర్ కార్యాలయంలో తేలనుంది. ఈక్రమంలో విచారణకు రావాలని స్పీకర్ తమ్మినేని సీతారం శుక్రవారం వారికి నోటీసులు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై ఈనెల 29న స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆరోజు ఉదయం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.


కాగా ఇంతకు ముందే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. 4 వారాల గడువు ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను చంద్రబాబు కోరారు. ఈ పరిణామాలతో స్పీకర్ పేషీ ఆదేశాలు రాజ్యసభ ఎన్నికల ముందు ఉత్కంట రేపుతున్నాయి.

– చేరికలు వాయిదా?

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడంతో పాటు కొందరి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారంతో వెనక్కుతగ్గుతున్నారు.


పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరు కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. టిక్కెట్‌ దక్కని మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ, జనసేనలో చేరాలని రెడీ అవుతున్న తరుణంలో అనర్హత వేటు పడుతుందని భావించి వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యే వరకూ చేరికను వాయిదా వేసుకుంటున్నారు. అందుకే ఇప్పట్లో జనసేన, టీడీపీల్లో వైసీపీ నేతల చేరికలు ఉండవని చెబుతున్నారు.