Rama Banam Review చిత్రం పేరు: ‘రామబాణం’ విడుదల తేదీ: 05 మే, 2023 నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, సచిన్ ఖేడ్కర్, అలీ తదితరులు కెమెరా: వెట్రి పళనిసామి సంగీతం: మిక్కీ జె మేయర్ కథ: భూపతి రాజా ఎడిటింగ్: ప్రవీన్ పూడి నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ దర్శకత్వం: శ్రీవాస్ Rama Banam Review: కటౌట్ చూడడానికి కత్తిలా ఉంటాడు కానీ.. గోపీచంద్‌కి ఈ మధ్య కాలంలో సరైన సినిమానే పడటం […]
Rama Banam Review
చిత్రం పేరు: ‘రామబాణం’
విడుదల తేదీ: 05 మే, 2023
నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, సచిన్ ఖేడ్కర్, అలీ తదితరులు
కెమెరా: వెట్రి పళనిసామి
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ: భూపతి రాజా
ఎడిటింగ్: ప్రవీన్ పూడి
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: శ్రీవాస్
Rama Banam Review:
కటౌట్ చూడడానికి కత్తిలా ఉంటాడు కానీ.. గోపీచంద్‌కి ఈ మధ్య కాలంలో సరైన సినిమానే పడటం లేదు. దీంతో తనకి ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్నే నమ్ముకున్నాడు. ఈ ఇద్దరి కలయికలో సినిమా అనగానే.. అనౌన్స్మెంట్ రోజే అంచనాలు మొదలయ్యాయి. అందులోనూ ‘లక్ష్యం’ సినిమాకి కొనసాగింపు అన్నట్లుగా ఇందులో గోపీచంద్ బ్రదర్‌గా విలక్షణ నటుడు జగపతిబాబు వచ్చి చేరడం, తమిళ నటి ఖుష్భూ.. ఇలా భారీ తారాగణమే ఈ సినిమాలో నటించారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ వంటి వన్నీ గోపీచంద్‌లోని మాస్‌ని ఎలివేట్ చేస్తూనే.. ఇదొక కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్‌ని కలగజేశాయి. వాటికి తగ్గట్లుగానే చిత్ర ప్రమోషన్స్‌లో కూడా గోపీచంద్, జగపతిబాబు, హీరోయిన్ డింపుల్ హయాతి వంటి వారంతా.. ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అని, ఈ వేసవికి పర్ఫెక్ట్ సినిమా అనేలా ప్రచారం చేస్తూ వచ్చారు.
ఇలా అన్నీ కలిసి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాయి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ.. ఈ కాంబినేషన్‌తోనే సినిమాపై క్రేజ్ వచ్చేసింది కాబట్టి.. ఇప్పుడీ సినిమాతో గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ కొట్టారా? ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గోపీచంద్‌కి ఈ చిత్రం హిట్టిచ్చిందా? అసలు ఈ సినిమా ఎలా ఉంది? అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.
ఈ సినిమాకి ఉన్న విశేషం ఏమిటంటే.. అడుగడుగునా ఇదివరకు ఎక్కడో ఈ కథ చూసినట్లుగానే అనిపిస్తుంది.. లేదంటే ఇలాంటి సీన్ పలానా సినిమాలో ఉంది కదా అని మాట్లాడుకునేలా చేస్తుంది. అలా ఉంటుంది కథ. కథలోకి వస్తే.. రాజారామ్ (జగపతిబాబు), విక్కీ (గోపీచంద్) అన్నదమ్ములు. రాజారామ్, భువనేశ్వరి (ఖుష్బూ) రఘురామాపురం అనే గ్రామంలో ‘సుఖీభవ’ పేరుతో ఓ ఆర్గానిక్ హోటల్ రన్ చేస్తుంటారు. సంప్రదాయ వంటలతో.. వారు తయారు చేసే వంటలకు భారీ డిమాండ్ ఉంటుంది. అయినా కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తక్కువ ధరలకే వారు ఆ వంటలని ప్రజలకు అందిస్తుంటారు.
ఇది ఎదురు వ్యాపారం చేసుకునే వారికి నచ్చదు. దీంతో ఎలాగైనా వారి వ్యాపారంపై దెబ్బకొట్టాలని చూస్తారు. అందులో భాగంగా జీకే (తరుణ్ అరోరా), అతని మామ పాపారావు (నాజర్).. ‘సుఖీభవ’ హోటల్‌పై దాడి చేసి లైసెన్స్ ఎత్తికెళ్లిపోతారు. ఇది తెలుసుకున్న విక్కీ.. వారిపై దాడి చేసి లైసెన్స్ తీసుకొస్తాడు. కానీ రాజారామ్‌కి తమ్ముడు విక్కీ చేసిన దౌర్జన్యం నచ్చదు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించాలని అనుకుంటాడు. అన్నయ్య నిజాయితీ గురించి తెలిసిన విక్కీ.. పోలీసులకు చిక్కకుండా ఇంటిలో నుంచి కోల్‌కతా పారిపోతాడు.
కోల్‌కతా వెళ్లిన విక్కీ, అక్కడ భైరవి (డింపుల్ హయాతి)తో ప్రేమలో పడటంతో పాటు పెద్ద డాన్‌గా మారతాడు. విక్కీ డాన్ అయిన 15 ఏళ్ల తర్వాత మళ్లీ తన సొంత వూరు తిరిగి వస్తాడు. అతను ఎందుకు అప్పుడు రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత అన్నయ్యకు వచ్చిన కష్టం చూసి విక్కీ ఏం చేశాడు? అసలు విక్కీ అన్నయ్యకు వచ్చిన కష్టం ఏంటి? ఈ క్రమంలో భైరవిని విక్కీ పెళ్లి చేసుకున్నాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఈ ‘రామబాణం’ చిత్రాన్ని థియేటర్లో చూడాల్సిందే.
హీరో గోపీచంద్‌కి గానీ, అతని అన్నయ్యగా చేసిన జగపతిబాబుకు లభించిన పాత్రలలో కొత్తదనం అయితే ఏమీ లేదు. ఇద్దరికీ ఈ పాత్రలు కొట్టిన పిండే. అవలీలగా చేసేశారు. గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలలో తన సత్తా చాటాడు. ఆయన కటౌట్‌కి తగిన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి కానీ.. ఆల్రెడీ ఇలాంటివన్నీ ఆయన దాటుకునే వచ్చాడు. రాజారామ్‌గా జగపతిబాబు పాత్ర ‘టక్‌జగదీష్’ సినిమాలో మంచిగా ఉండే సమయంలో ఎలా అయితే ఉందో అదే కంటిన్యూ అయినట్లుగా అనిపిస్తుంది.
ఇందులో చాలా సాత్వికంగా, గొప్ప విలువలు కలిగిన మనిషిగా జగపతిబాబు మెప్పించాడు. అయితే ఈ ఇద్దరికీ కూడా ఈ పాత్రలు పెద్దగా పేరు తెచ్చేవి అయితే కాదనే చెప్పుకోవాలి. సీనియర్ నటి ఖుష్బూ పాత్ర ఉన్నతంగా ఉంది. ఆ పాత్రకి ఆమె నిండుతనం తెచ్చింది.
హీరోయిన్గా చేసిన తెలుగుమ్మాయ్ డింపుల్ హయాతికి కూడా పెద్దగా పాత్రేం లేదు. గోపీచంద్‌తో కొన్ని లవ్ సీన్స్, పాటలకు మాత్రమే ఆమె పాత్రని పరిమితం చేశారు. విలన్‌గా నాజర్, తరుణ్ అరోరా పరవాలేదనిపిస్తే.. అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి వంటి కామెడీ బ్యాచ్ అంతా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇంకా పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చే రౌడీలు.. అంతా వారి పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా అంతా చాలా రిచ్‌గా ఉంది. పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంతగా ఈ చిత్రాన్ని నిర్మాతలు నమ్మారు. ఇంకా ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే. సంగీతం పరంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ.. పాటలు అంతగా ఎక్కేలా లేవు. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు, సెకండాఫ్ కొన్ని సీన్లకు కత్తెర వేసి ఉండాల్సింది.
సాగదీత సీన్లు చూస్తున్న ప్రేక్షకులను విసిగిస్తాయి. అలాగే స్క్రీన్‌ప్లే కూడా అంత గొప్పగా లేదు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు వారి పనితనం కనబరిచారు. ఇక దర్శకుడు శ్రీవాస్ చాలా గ్యాప్ తర్వాత చేసిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలకు అనుగుణంగా అయితే ఈ సినిమాని మలచలేకపోయాడు. పరమ రొటీన్ కథతో ప్రేక్షకులను మెప్పించాలని చూశాడు కానీ.. అతని ప్రయత్నం వర్కవుట్ కాలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ’ చిత్రం.. గతంలో ‘మీనా’ అనే చిత్రం నుంచి స్ఫూర్తి పొందిందే. కానీ దానిని నేటి తరానికి త్రివిక్రమ్ చెప్పిన తీరు అందరినీ మెప్పించింది. కానీ ఈ సినిమాలో అదే లోపించింది. సినిమాని ఎగ్జిక్యూట్ చేసిన విధానం పరమ రొటీన్ అనేలా ఉంది. అవుట్‌డేటెడ్ స్టోరీని తీసుకున్నా.. దానిని నేటి తరానికి మలిచే విధానంలో శ్రీవాస్ ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి.
ముఖ్యంగా ఈ సినిమా ప్రతి సీన్లో ఏదో ఒక సినిమాని తలపించడం ప్రధాన మైనస్‌గా మారింది. వ్యాపారం అనే కోణంలో చిరంజీవి ‘దొంగమొగుడు’, హీరో పారిపోవడం ‘గబ్బర్‌సింగ్’, పెళ్లి చేయాలంటే ఫ్యామిలీ ఉండాలని డిమాండ్ చేయడం ‘వీరసింహారెడ్డి’.. ఇలా ఏదో ఒక సినిమా గుర్తొస్తుంటుంది. ఆర్గానిక్ ఫుడ్‌పై చెప్పిన కొన్ని సందేశాత్మక సన్నివేశాలు మినహా.. ఈ సినిమాలో కొత్తదనం అనేది ఏదీ కనిపించదు. ఆ విషయంలో కూడా ‘భీష్మ’ సినిమాని తలపిస్తుందీ చిత్రం.
అయితే ఈ కథని ఇంకా వైవిధ్యంగా ప్లాన్ చేసి ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఫ్యామిలీలతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. కానీ అలాంటి ఛాన్స్‌ను శ్రీవాస్ మిస్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా బాలయ్య సినిమాలలో మాదిరిగా సినిమాటిక్ లిబర్టీని బాగా వాడారు. ఏదైనా ఒక్క సీన్లోనే అన్ని జరిగిపోయినట్లుగా చూపించడం అంత పెద్దగా నప్పలేదు. అందుకేనేమో.. ఇది బాలయ్య వదిలిన ‘రామబాణం’ అనేలా ప్రచారం చేశారు. ఆయన సినిమాలలో కూడా తొడకొడితే రైలు ఆగిపోవడం, సుమోలు వెనక్కి పోవడం వంటి సినిమాటిక్ సన్నివేశాలు ఉంటాయి. అలాంటివే ఇక్కడ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలలో వాడారు.
సినిమా నిండా కమెడియన్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ.. కామెడీ కూడా సరిగా పండలేదు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని సీన్లు మెప్పిస్తాయి. మొత్తంగా అయితే.. ఇది కొత్తదనం లేని పరమ రొటీన్ సినిమా. ఈ జనరేషన్ ఆడియన్స్‌కి ఈ సినిమా ఏ కోశానా నచ్చే ఛాన్స్ లేదు. మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడేవారు మాత్రం ఒకసారి చూడొచ్చు. అంతే తప్ప కొత్తదనం కోరుకుని సినిమాకి వెళితే మాత్రం ఘోరంగా డిజప్పాయింట్ అవుతారు. ఓవరాల్‌గా అయితే ఇది రామబాణం కాదు.. పరమ రొటీన్ బాణం. బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే.
ట్యాగ్‌లైన్: రామ కాదు.. రొటీన్ బాణం
రేటింగ్: 2/5