Shilpa Shetty | ముద్దుల కేసులో.. శిల్పాశెట్టికి ఊరట

మేజిస్ట్రేట్‌ తీర్పును సమర్థించిన సెషన్స్‌ కోర్టు 2007 నాటి కేసులో ఊపిరి పీల్చుకున్న ముద్దుగుమ్మ విధాత: ఒక బహిరంగ వేదికపై బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ గేర్‌ (Richard Gere) ముద్దులు పెట్టిన దృశ్యం గుర్తుందా? దీనిపై కేసుకూడా నడిచింది. 2007 నాటి ఆ కేసులో శిల్పాశెట్టికి (Shilpa Shetty) భారీ ఊరట లభించింది. ఈ కేసులో శిల్పాశెట్టిని విడిచిపెట్టడం సబబేనని ముంబై సెషన్స్‌ కోర్టు పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్‌ […]

Shilpa Shetty | ముద్దుల కేసులో.. శిల్పాశెట్టికి ఊరట
  • మేజిస్ట్రేట్‌ తీర్పును సమర్థించిన సెషన్స్‌ కోర్టు
  • 2007 నాటి కేసులో ఊపిరి పీల్చుకున్న ముద్దుగుమ్మ

విధాత: ఒక బహిరంగ వేదికపై బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ గేర్‌ (Richard Gere) ముద్దులు పెట్టిన దృశ్యం గుర్తుందా? దీనిపై కేసుకూడా నడిచింది. 2007 నాటి ఆ కేసులో శిల్పాశెట్టికి (Shilpa Shetty) భారీ ఊరట లభించింది. ఈ కేసులో శిల్పాశెట్టిని విడిచిపెట్టడం సబబేనని ముంబై సెషన్స్‌ కోర్టు పేర్కొన్నది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. గతంలో మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. కోర్టు తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రానప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనల్లో పస లేదని కోర్టు గుర్తించిందని, గేర్‌ చేసిన పనికి ఆమె బాధ్యురాలు కాదని తేల్చిందని సమాచారం.

2007 నాటి కేసు

2007లో రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఎయిడ్స్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమం ఒకటి జరిగింది. హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌గేర్‌, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో శిల్పాశెట్టి మాట్లాడుతుండగా.. ఆమె చేతిపై చుంబించిన గేర్‌.. ఆ వెంటనే ఆమెను హత్తుకుని బుగ్గలపై ముద్దులు కురిపించారు. ఇది చూడటానికి అసభ్యంగా ఉన్నదని, భరతీయ సంస్కృతికి విరుద్ధమని కొందరు భావించారు. వీరిద్దరి పైనా ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల్లోని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

2017లో ముంబైకి బదిలీ

2017లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును ముంబైకి బదిలీ చేశారు. అక్కడ కేసును బల్లార్డ్‌ పియర్‌ మేజిస్ట్రేట్‌ విచారించారు. 2022 జనవరిలో ఈ కేసులో శిల్ప తప్పేమీ లేదని ఆయన తేల్చారు. గేర్‌ చేసిన పనికి శిల్ప బాధితురాలుగా ఉన్నారని కోర్టు అభిప్రాయపడింది. గేర్‌ ముద్దులు పెడుతున్నప్పుడు శిల్ప ప్రతిఘటించనంత మాత్రాన ఆమె ఒక నేరంలో కుట్రదారుగా లేదా తప్పు చేసిన వ్యక్తిగా గుర్తించలేమని పేర్కొన్నది.

మహారాష్ట్ర ప్రభుత్వం రివిజన్‌ పిటిషన్‌

అయితే.. మేజిస్ట్రేట్‌ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మేజిస్ట్రేట్‌ ఆదేశాలు చట్టవ్యతిరేకమని, సాధారణ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నదని వాదించింది. బహిరంగంగా తనను ముద్దు పెట్టుకునేందుకు శిల్ప అనుమతించడం కచ్చితంగా అసభ్య ప్రవర్తన చట్టంలోని సెక్షన్‌ 294 కిందకు వస్తుందని పేర్కొన్నది. అయితే.. రివిజన్‌ పిటిషన్‌ను పరిశీలించిన సెషన్స్‌ కోర్టు.. దానిని కొట్టేసింది. గతంలో మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

చర్చ రేపిన గేర్‌ ముద్దు ముచ్చట

బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం భారతదేశంలో నిషిద్ధం. ఈ ఘటన తర్వాత ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. కోర్టు విచారణ ప్రక్రియపై ఆసక్తి రేగింది. భారతదేశ సాంస్కృతిక సహనశీలత, కళాత్మక వ్యక్తీకరణలకు ఇది ఒక పరీక్ష వంటిదని అప్పట్లో పలువురు వ్యాఖ్యానించారు.