Satavahana University | ‘శాతవాహన’కు అవినీతి మకిలీ.. షాడో ఉపకులపతిగా రిటైర్డ్ ప్రొఫెసర్

Satavahana University | అవినీతికి పాల్పడిన వారికే అందలం అర్హతలు లేకున్నా కొలువులు లేని శాఖకు ప్రొఫెసర్.. వేతనం లక్ష షాడో ఉపకులపతిగా రిటైర్డ్ ప్రొఫెసర్ యూజీసీనే తప్పుదోవ పట్టించిన పాలకవర్గం రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చేశారు ప్రతిభ గల పేద విద్యార్థులకు ఫీజుల భారం ఆ శాఖే లేదు.. అయినా ఎంట్రెన్స్ ఆ ఆరు కోర్సుల యూజీసీ గుర్తింపు గల్లంతు తాడూరు కరుణాకర్‌, విధాత బ్యూరో, కరీంనగర్ : యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన, […]

Satavahana University | ‘శాతవాహన’కు అవినీతి మకిలీ.. షాడో ఉపకులపతిగా రిటైర్డ్ ప్రొఫెసర్

Satavahana University |

  • అవినీతికి పాల్పడిన వారికే అందలం
  • అర్హతలు లేకున్నా కొలువులు
  • లేని శాఖకు ప్రొఫెసర్.. వేతనం లక్ష
  • షాడో ఉపకులపతిగా రిటైర్డ్ ప్రొఫెసర్
  • యూజీసీనే తప్పుదోవ పట్టించిన పాలకవర్గం
  • రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చేశారు
  • ప్రతిభ గల పేద విద్యార్థులకు ఫీజుల భారం
  • ఆ శాఖే లేదు.. అయినా ఎంట్రెన్స్
  • ఆ ఆరు కోర్సుల యూజీసీ గుర్తింపు గల్లంతు

తాడూరు కరుణాకర్‌, విధాత బ్యూరో, కరీంనగర్ : యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన, ఇష్టారీతిన నియామకాలు, నిధుల దుర్వినియోగం. అవినీతి పరులకే అందలం.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అవలక్షణాలు శాతవాహన విశ్వవిద్యాలయ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఇటు ప్రభుత్వాన్ని, అటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్( యూజీసీ) ను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఈ విశ్వవిద్యాలయానికి మాయని మచ్చ తెచ్చాయి.

ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందుబాటులో తేవడానికి, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి, యూనివర్సిటీ అభివృద్ధి పట్ల శాతవాహన వర్సిటీ పాలకవర్గం శ్రద్ధ చూపకపోవడంతో యూనివర్సిటీ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారైంది. ఇటీవల ఓ విద్యార్థి సంఘ నేత శాతవాహన విశ్వవిద్యాలయ స్థాయి ఓ ప్రాథమిక పాఠశాల కన్నా అధ్వానంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

అవినీతికి అందలం…

2017-18 ఆర్థిక సంవత్సరంలో విశ్వవిద్యాలయ క్రీడా విభాగంలో 1,07,832 రూపాయల మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆడిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. నాడు సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, క్రీడా కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న వన్నాల రమేష్ ను నిధుల దుర్వినియోగానికి బాధ్యునిగా తేల్చింది. దీంతో 2019 జూన్ 6న రమేష్ చలాన్ రూపేణా ఆ మొత్తాన్ని విశ్వవిద్యాలయానికి తిరిగి చెల్లించారు.

దీనిపై ఆయన ఇచ్చిన సంజాయిషిని పరిగణలోకి తీసుకోని నాటి ఉపకులపతి రమేష్ కు సంబంధించిన యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఆపుతూ, మూడేళ్ల పాటు ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారాలు ఆయనకు ఇవ్వరాదంటూ ఇచ్చిన ఆదేశాలకు లోబడి 2019 జూన్ 15న రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి మొహమ్మద్ అమీర్ అనే సామాజికవేత్త వర్సిటీ క్రీడా కార్యదర్శిగా ఉన్న రమేష్ పై లోకాయుక్తకు (4753/2016/B21) ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నేటికీ కొనసాగుతున్నది. ఇదే అంశంపై ఆయన 7 జూలై 2022 న గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు.

నిబంధనలు పక్కన పెట్టి..

నవంబర్ 2022 లో వన్నాల రమేష్ పదవీ విరమణ పొందారు. గతంలో ఆయనపై ఉన్న ఆరోపణలు, కొనసాగుతున్న విచారణలు అన్నింటిని పక్కనపెట్టిన తాజా ఉపకులపతి పదవీ విరమణ పొందిన నెల రోజులకే అడ్జెంక్ట్ (ADJUNCT) ఫ్యాకల్టీ పేరిట రమేష్ కు మళ్లీ కొలువు కట్టబెట్టారు. సోషియాలజీ విభాగం డిపార్ట్మెంట్ హెడ్, ప్రిన్సిపల్ ఆదేశాల ప్రకారం బోధన వ్యవహారాలకు పరిమితం కావాల్సిన రమేష్, విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి, ఉపకులపతి అనధికార ఓఎస్డీడిగా చక్రం తిప్పుతూ వస్తున్నారు. ఈయనకు అధికారికంగా వర్సిటీ వాహనాన్ని కేటాయించే అవకాశం లేకపోయినా, రమేష్ హైదరాబాద్ నుండి కరీంనగర్ రావడానికి ఉపకులపతి అధికార వాహనాన్ని కేటాయించారు.

ఈ వాహనంపై ఓవర్ స్పీడ్ చలాన్లు అనేకం నమోదయి ఉన్నాయి. అంతేకాక హైదరాబాద్ హకీంపేట వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. దీనికి గుట్టు చప్పుడు కాకుండా, ఒక ప్రైవేట్ షోరూం లో మరమ్మతులు చేయించారు. వర్సిటీ వాహనాల ప్రయాణాల నమోదుకు సంబంధించి లాగ్ బుక్ (4114) ను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ బాధ్యత నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఫ్యాకల్టీకి అప్పగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉపకులపతి ఆదేశాలతో వన్నాల రమేష్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. కళాశాలల అనుమతులు, కొత్త కోర్సులు ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి ఈయన సంబంధిత కళాశాలల యాజమాన్యాల నుండి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నరంటూ రెగ్యులర్ అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.

కోర్సు లేనేలేకున్నా…

శాతవాహన విశ్వవిద్యాలయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం లేదు. ఆశ్చర్యకరంగా లేని ఈ విభాగానికి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ను నియమించారు. ఈయనకు నెలకు లక్ష రూపాయల వేతనాన్ని అప్పనంగా అందజేస్తున్నారు. అడ్జెంక్ట్ ఫ్యాకల్టీ పేరిట ఈయనను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్న రెగ్యులర్ అధ్యాపకులకు సమాధానం లేదు. వేతనంలో వాటాల కోసమే ఈ పదవి కట్టబెట్టారనే ఆరోపణలు లేకపోలేదు.

వింతల్లోకెల్లా వింత…

శాతవాహన వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం లేకపోయినా ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (పీసెట్‌) నిర్వహణ బాధ్యతను హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఈ వర్సిటీకి అప్పగించడం వింతల్లోకెల్లా వింత. ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఫలితాల ప్రకటన పనులకు మొత్తం బడ్జెట్ ఎంత? అందులో ఖర్చు చేసింది ఎంత? దీని వెనక ఉన్న మతలబు ఏమిటి? అనేది ఓ బ్రహ్మ పదార్థంగానే మారిపోయింది.

యూజీసీనే తప్పుదోవ పట్టించారు…

విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ నుండి శాతవాహనకు 12 బి రికగ్నైజేషన్ తీసుకురావడానికి ఉపకులపతి మొత్తం విద్యార్థుల భవిష్యత్తునే ఫణంగా పెట్టారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు యూజీసీని తప్పుదోవ పట్టించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో మొత్తం 14 కోర్సులు నిర్వహిస్తుండగా, ఆరు కోర్సులు తమ నిర్వహణలో లేనట్టుగా (SU/KNR/UGC/2021-22/387) 25 ఆగస్టు 2021 యుజీసికి పంపిన లేఖలో పేర్కొన్నారు.

వాస్తవానికి ఆర్ట్స్ కళాశాలలో ఐదు కోర్సులు, సైన్స్ కళాశాలలో మరో ఐదు కోర్సులు, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో రెండు కోర్సులు, యూనివర్సిటీ కళాశాల ( కరీంనగర్) ఒక కోర్సు, యూనివర్సిటీ కళాశాల (గోదావరిఖని) మరో కోర్సు కలిపి మొత్తం 14 కోర్సులు నిర్వహణలో ఉండగా యూజీసీకి మాత్రం ఎనిమిది కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కారణాలివే..

యుజీసి 12 బి గుర్తింపు కోసం వర్సిటీ నిర్వహిస్తున్న కోర్సులు, బోధన సిబ్బంది, కల్పిస్తున్న సౌకర్యాలు చూపించడం తప్పనిసరి. వర్సిటీ పరిధిలోని ప్రతి శాఖకు తప్పనిసరిగా ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలన్నది నిబంధన. ఈ లెక్కన శాతవాహన విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న కోర్సులకు 109 మంది ఆధ్యాపకులు అవసరం. అయితే ఈ వర్సిటీలో కేవలం 15 మంది రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉండడం గమనార్హం. మరో 94 పోస్టులలో 50 శాతం పోస్టులను కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులతో భర్తీ చేయగా, మరో 50% పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దీంతో కేవలం బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, ఉర్దూ, కెమిస్ట్రీ, ఫార్మసీ, ఫిజిక్స్ కోర్సులు మాత్రమే తాము నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పాలకవర్గం యుజిసిని తప్పుదోవ పట్టించింది. మరో 6 కోర్సులైన బాటని, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలను యుజీసి దృష్టికి రాకుండా చేసింది. విశ్వవిద్యాలయంలో ఈ ఆరు కోర్సులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో ముంచింది.

శాతవాహన విశ్వవిద్యాలయం 12 బి కోసం చేసుకున్న దరఖాస్తుపై విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ నలుగురు సభ్యుల బృందం 2021 డిసెంబర్ 9, 10 తేదీలలో ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కేవలం ఎనిమిది కోర్సులకు సంబంధించిన వివరాలు మాత్రమే యూనివర్సిటీ పాలకమండలి యుజీసి ఎక్స్పర్ట్ కమిటీకి అందజేసింది. దీంతో 2022 మార్చ్ 22వ తేదీనయూజీసి విశ్వవిద్యాలయానికి 12 బి గుర్తింపు ఇచ్చింది.

పేద విద్యార్థులకు శాపం…

శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పడిన తొలినాళ్లలో 2009లో తెలుగు, ఇంగ్లీష్ రెగ్యులర్ కోర్సులుగా ప్రారంభం కాగా, 2013లో మ్యాథ్స్, బాటని రెగ్యులర్ కోర్సులుగా ప్రారంభించబడ్డాయి. వర్సిటీ ఇంచార్జ్ ఉపకులపతిగా బి. జనార్దన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించిన కాలంలో వర్సిటీలోని రెగ్యులర్ కోర్సులకు శాంక్షన్డ్ పోస్టులు ఇవ్వాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేస్తూ వాటికి శాంక్షన్డ్ పోస్టులు ఇవ్వాలని 2015 నవంబర్ 21 వ తేదీన ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

53 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టులు అవసరమని ఆయన అనేకమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాలేదు. ప్రస్తుత ఉపకులపతి 2022-23 నుండి గతంలో రెగ్యులర్ కోర్సులుగా ఉన్న మ్యాథ్స్, బాటని, తెలుగు, ఇంగ్లీష్ లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చివేశారు. దీంతో ప్రతిభగల పేద విద్యార్థులకు వర్సిటీలో ఉచిత విద్యను అందుబాటులో లేకుండా చేశారు.

గతంలో తెలుగు విభాగంలో రూ. 3,100 చెల్లించాల్సిన విద్యార్థులు ప్రస్తుతం రూ. 15,000, ఇంగ్లీష్ విభాగంలో రూ. 3110 ఫీజు చెల్లించాల్సిన విద్యార్థులు రూ. 15,000, మ్యాథ్స్ విభాగంలో రూ. 3,710 ఫీజు చెల్లించాల్సిన విద్యార్థులు రూ. 21,000, బాటని విభాగంలో రూ. 3,710 ఇది చెల్లించాల్సిన విద్యార్థులు రూ. 25,000, ఫుడ్ అండ్ సైన్స్ విభాగంలో రూ. 30,000, కంప్యూటర్ విభాగంలో రూ. 30,000 ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం విద్యార్థులకు ఏర్పడింది.

ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్ విభాగంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులైన వీటిని రెగ్యులర్ చేయాలనే డిమాండ్ ఉండగా, గతంలో నిర్వహిస్తున్న రెగ్యులర్ కోర్సులు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మారుస్తూ ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం చేసినా, స్థానిక ప్రజాప్రతినిధులకు పట్టింపు లేకుండా పోయిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

డిపాజిట్ నిధులు దారి మళ్లింపు..

కాకతీయ నుండి శాతవాహన విశ్వవిద్యాలయంగా ఏర్పడిన నాడు ఈ వర్సిటీకి రూ. 100 కోట్ల ఫిక్స్ డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణం పేరిట రూ. 9 కోట్లు, 12 బి గుర్తింపు కోసం మరో మూడు కోట్ల రూపాయలు ఇందులోనుండి ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులకు సంబంధించి నోటిఫికేషన్, టెండర్ల ప్రక్రియ లేకుండానే పాలకమండలి ఇష్టారీతిన నిధులు ఖర్చు చేయడం వివాదాస్పదం అవుతోంది.

నియామకాలు ఓ గోల్ మాల్..

శాతవాహన విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థులు కేవలం సర్టిఫికెట్ల కోసమే ఇక్కడ చదవాల్సిన పరిస్థితి. బోధన సిబ్బంది కొరత కారణంగా విద్యార్థులకు పాఠాలు చెప్పే దిక్కే లేకుండా పోయింది. విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రాపకంతో అనేకమంది బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కాంట్రాక్ట్, పార్ట్ టైం బోధన సిబ్బంది అవతారం ఎత్తారు. వీరు కూడా నెల నెల వేతనాలు తీసుకుపోవడమే తప్ప తరగతులకు హాజరయ్యేది లేదు. యూనివర్సిటీలో అనేకమంది తగిన అర్హతలు లేకుండానే కొలువులు పొందిన విషయాన్ని విద్యార్థి సంఘాలు ఆధారాలతో సహా ఉపకులపతి ముందు ఉంచినా, పలుమార్లు ఆందోళనలు చేపట్టినా, బోగస్ అధ్యాపకుల పై తీసుకున్న చర్యలు లేవు.

అవినీతి రాజ్యమేలుతోంది

శాతవాహన యూనివర్సిటీలో అవినీతి,అక్రమాలు రాజ్యం ఏలుతున్నాయి. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదు. పూర్తిస్థాయి విసి నియామకమైనా యూనివర్సిటీలో పాలన గాడి తప్పింది యూనివర్సిటీ లో నిధులు దుర్వినియోగం, బోగస్ పత్రాలతో ఉద్యోగాల నియామకాలు, రిటైర్డ్ అయి అవినీతి పాల్పడ్డ వారికి మళ్ళీ కాంటాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు ఇష్టానుసారంగా పెంచడం అసలు శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై, నియామకాలపై, అక్రమ పదోన్నతులపై, రిటైర్డ్ అక్రమార్కుల నియామకాలపై విజిలెన్స్ కమిటీ చేత విచారణ జరిపించాలి.

– కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్

యూనివర్సీటీని నిర్వీర్యంచేసిన సర్కారు

శాతవాహన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా పూర్తిగా నిర్వీర్యం చేసింది. శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలుగు, ఇంగ్లీష్ మాథ్స్, బోటని వంటి కోర్సులను పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం ద్వారా విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు. యూనివర్సిటీ యుజీసీ నుండి 12బి గుర్తింపు కోసం 8కోర్సులను మాత్రమే చూపించారు. మిగతా ఆరు కోర్సులు ఉన్నట్టా, లేనట్టా అధికారులు తెలియజేయాలి.

యూనివర్సిటీలో బోధన, బోధనతర సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోకుండా రిటైర్మెంట్ అయిన వాళ్లని తిరిగి విధుల్లోకి తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్లతో అధ్యాపక,అధ్యాపకేతర బృందం కొన్ని సంవత్సరాలుగ పనిచేస్తున్నా యూనివర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

హాస్టల్లో తగినన్ని మౌలిక వస్తువులు లేక సెక్యూరిటీ సరిగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. యూనివర్సిటీలో ఎలాంటి కమిటీ నిర్ణయం లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారు యూనివర్సిటీ విద్యను పూర్తిగా పాఠశాల విద్యకు దిగజారుస్తున్నారు. అధికారులు యూనివర్సిటీ సొమ్మును యథేచ్ఛగా వాడుతున్నప్పటికీ, అనేక రకాల ఆరోపణలు ఉన్నప్పటికీ వాళ్లపైన చర్యలు తీసుకోకపోవడం యూనివర్సిటీ అధికారుల పనితీరుకు నిదర్శనం. – మల్యాల రాకేష్ , జిల్లా కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్