Road Accident | విధాత: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పట్టణంలోని కృష్ణమానస కాలనీ సమీపంలో గల అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై ఆదివారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడిన కారును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
కాగా.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని నందిపాడు గ్రామానికి చెందిన జ్యోతి (30), మహేష్ (35),మచ్చేందర్ (38), ఇషిక (8), లియాన్స్(2)లు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.ఈ నెల 26న కారులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లిన వారు ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.