విధాత: వివేకా హత్యకేసు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత వివేకా తరఫున కోర్టుల్లో పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతకు టీడీపీ నాయకుడు బీటెక్ రవి సహాయం చేస్తున్నారని మొదటి నుంచీ ఆరోపణలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది.
వాస్తవానికి 2017లో వివేకా మీదనే ఈ టీడీపీ నాయకుడు బీటెక్ రవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం ఆయన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ హోదాలో ఆయనకు 2+2 గన్ మెన్లు ఉండేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన భద్రతను సగానికి అంటే 1+1 గన్ మెన్లను కుదించింది.
ఇదిలా ఉండగా అప్పట్లో భాస్కర్ రెడ్డి.. అవినాష్ రెడ్డి తదితరులు బీటెక్ రవితో చేతులు కలిపి వివేకాను ఓడించారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అదే వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి.. అవినాష్ నిందితులుగా ఉన్నారు.
మరోవైపు బీటెక్ రవి కూడా సునీతకు ఈ విషయంలో సహకరిస్తూ జగన్‌ను.. అవినాష్‌ను ఇబ్బంది పెడుతున్నట్లు వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తనకు భద్రత తగ్గించడాన్ని కోర్టులో సవాల్ చేస్తాను అని బీటెక్ రవి అన్నారు.