Sharad Pawar | ప్రధాని పదవిపై చర్చించలేదు: శరద్‌పవార్
Sharad Pawar | మా భేటీపై మీకెందుకు ఆందోళన? పరిపక్వత లేని బీజేపీ విమర్శలు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ బారామతి: పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాన మంత్రి పదవి గురించి చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూరితంగా మతతత్వ శక్తులను రెచ్చగొడుతున్న తీరు వంటి అంశాలపై తమ చర్చలు నడిచాయని ఆయన చెప్పారు. సోమవారం బారామతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల సమావేశాన్ని బీజేపీ విమర్శించడాన్ని తప్పుపట్టారు. […]

Sharad Pawar |
- మా భేటీపై మీకెందుకు ఆందోళన?
- పరిపక్వత లేని బీజేపీ విమర్శలు
- ఎన్సీపీ అధినేత శరద్‌పవార్
బారామతి: పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాన మంత్రి పదవి గురించి చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూరితంగా మతతత్వ శక్తులను రెచ్చగొడుతున్న తీరు వంటి అంశాలపై తమ చర్చలు నడిచాయని ఆయన చెప్పారు. సోమవారం బారామతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షాల సమావేశాన్ని బీజేపీ విమర్శించడాన్ని తప్పుపట్టారు. తమ సమావేశం పట్ల బీజేపీ ఎందుకు ఆందోళన చెందుతున్నదని ప్రశ్నించారు. బీజేపీ విమర్శల్లో రాజకీయ పరిపక్వత లోపించిందన్నారు.
ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న 19 మంది సమావేశమయ్యారన్న బీజేపీ విమర్శలను మీడియా ప్రస్తావించగా.. అవి పిల్ల చేష్టలతో కూడి ప్రకటనలంటూ కొట్టిపారేశారు.
‘ప్రధాని పదవి గురించి సమావేశంలో చర్చ జరుగలేదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం చర్చకు వచ్చాయి. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తీరుపై చర్చించాం’ అని తెలిపారు. కులం, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం ఏ సమాజానికీ మంచిది కాదని అన్నారు. దీన్ని ఎలా నియంత్రించాలన్నదే కీలకమైన అంశమని చెప్పారు.
‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం పెట్టుకునే హక్కు లేదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ఆయన పేరేంటో నాకు గుర్తు లేదు.. సమావేశం పెట్టుకోవాల్సిన అవసరమేంటని ఆయన అంటారు. ముంబైలో మీటింగ్ పెడుతున్నట్టు ఆయన ప్రకటనలో చూశాను. మీరు సమావేశం పెట్టుకోవచ్చు. అదే మేం సమావేశమైతే మీకు ఎందుకు ఆందోళన?’ అని పవార్ అన్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తేవాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి ఇటీవల పాట్నాలో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్, వాపమక్షాలు సహా 15 పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. తమది రాష్ట్రాల వారీగా వ్యూహాలతో ఉమ్మడి అజెండా ఉంటుందని స్పష్టంచేశారు. ఈ క్రమంలో తమ మధ్య విభేదాలను పక్కనపెడతామని పేర్కొన్నారు.