కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. శశిథరూర్ వర్సెస్ అశోక్ గెహ్లాట్
విధాత : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఎవరూ పోటీ చేస్తారా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సారి గాంధీయేతర కుటుంబానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పోటీ ఆ పార్టీ సీనియర్లు అయినా శశిథరూర్, అశోక్ గెహ్లాట్ మధ్య ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్.. నిన్న సోనియా గాంధీని […]

విధాత : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఎవరూ పోటీ చేస్తారా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సారి గాంధీయేతర కుటుంబానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పోటీ ఆ పార్టీ సీనియర్లు అయినా శశిథరూర్, అశోక్ గెహ్లాట్ మధ్య ఉండే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్.. నిన్న సోనియా గాంధీని కలిశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సోనియా నుంచి శశిథరూర్ అనుమతి పొందినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకులు తనకు పూర్తి మద్దతు ఇస్తున్నారని, దానికి సంబంధించిన ఆన్‌లైన్ పిటిషన్‌లో 600 మందికి పైగా యువ నాయకులు సంతకాలు సేకరించిన విషయాన్ని సోనియాకు శశిథరూర్ వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ 23 నేతల్లో శశిథరూర్ కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు.
సోనియాతో శశిథరూర్ భేటీ జరిగిన కొద్ది గంటలకే మరో వార్త బయటకొచ్చింది. అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీనే చేపట్టాలని గత కొంతకాలం నుంచి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. అందరికీ స్వాగతం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా ఎన్నిక ప్రక్రియ జరుగుతుందన్నారు. పోటీ చేయడానికి ఎవరి ఆమోదం అవసరం లేదన్నారు.
పార్టీని సంస్ధాగతంగా ప్రక్షాళన చేయాలని అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని జీ23 నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అధ్యక్ష పదవి ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి.