విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పదే పదే జోక్యం చేసుకుంటూ అక్కడి కమిటీలకు పోటీగా సమాంతర పనిని నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డికి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఆదివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని నోటీసులో స్పష్టం చేశారు. దీనిపై రాఘవరెడ్డి ఏ విధంగా ప్రతిస్పందిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
జంగా వర్సెస్ నాయిని
కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డి తరచూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని మీడియాతో చెప్పారు. పైగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నాయిని రాజేందర్రెడ్డి నాన్ లోకల్ వ్యక్తి అంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి నాయిని రాజేందర్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలు పొడ చూపాయి.
మరోవైపు హనుమకొండలో రాఘవరెడ్డి హాత్‌సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిని రాజేందర్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో కమిటీ స్పందించినట్లు భావి స్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాఘవరెడ్డికి షోకాజు నోటీస్ జారీ చేసినట్లు భావిస్తున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా అదే పద్ధతి
ఈ క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే రాఘవ రెడ్డికి అనేక లేఖలు రాసినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. మీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పై వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసిసి కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజు, ఇంచార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంభాని చంద్రశేఖర్ ముందు ఆదివారం ఉదయం హాజరుకావాలని కోరినప్పటికీ మీరు గైరా హాజరయ్యారని రాఘవరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసులో చిన్నారెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశానికి నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారని తెలిపారు. రాఘవరెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘన చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటిసులో స్పష్టం చేశారు. సకాలంలో తగిన వివరణ ఇవ్వకుంటే పార్టీ క్రమశిక్షణ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి షోకాజు నోటీసులో హెచ్చరించారు.