Indian Fishermen | 23 మంది భార‌త జాల‌ర్ల‌ అరెస్టు

శ్రీలంక నౌకాదళం 23 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. త‌మ దేశ జలాల్లో చేప‌ల వేట సాగిస్తున్నందుకు జాల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిపింది

Indian Fishermen | 23 మంది భార‌త జాల‌ర్ల‌ అరెస్టు
  • త‌మ సముద్ర జ‌లాల్లోకి వ‌చ్చార‌ని
  • అదుపులోకి తీసుకున్న శ్రీ‌లంక‌
  • రెండు బోట్లు కూడా స్వాధీనం


Indian Fishermen | విధాత‌: శ్రీలంక నౌకాదళం 23 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. త‌మ దేశ జలాల్లో చేప‌ల వేట సాగిస్తున్నందుకు జాల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిపింది. రెండు చేప‌ల బోట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్న‌ట్టు పేర్కొన్న‌ది. ఈ మేర‌కు ఆదివారం అధికారిక ప్రకటన విడుద‌ల చేసింది. జాఫ్నాలోని డెల్ఫ్ట్ ద్వీపానికి ఉత్తరాన శనివారం నాడు మత్స్యకారులను అరెస్టు చేసి, వారి రెండు ట్రాలర్ల‌ను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీలంక నేవీ వెల్ల‌డించింది.


పట్టుబడిన 23 మంది మత్స్యకారులు, వారి రెండు బోట్ల‌ను కంకెసంతురై హార్బర్‌కు తరలించారు. తదుపరి చర్యల‌ కోసం మైలాడి ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని శ్రీ‌లంక నేవీ తెలిపింది. విదేశీ ఫిషింగ్ ట్రాలర్లు అక్రమంగా చేపలు ప‌ట్ట‌డాన్ని అరికట్టడానికి, స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని ర‌క్షించ‌డానికి శ్రీలంక జలాల్లో నావికాదళం క్రమం తప్పకుండా పెట్రోలింగ్, నిఘా పెడుతున్న‌ది. ఇందులో భాగంగా నార్తర్న్ నేవల్ కమాండ్ నేవీ, శ్రీలంక కోస్ట్ గార్డ్‌కు చెందిన ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌ను మోహరించారు. భారత జాల‌ర్లు త‌మ స‌ముద్ర జలాల్లోకి వ‌చ్చార‌ని గుర్తించి అరెస్టు చేసిన‌ట్టు తెలిపింది.


అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై భారత మత్స్యకారులను శ్రీలంక అధికారులు అరెస్టు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జనవరిలో 36 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అరెస్టు చేసింది.