Srikanth |
ఆంధ్ర ప్రదేశ్ లో లభించే మద్యంపై సోషల్ మీడియాలో అనేక సెటైరికల్ వీడియోలు దర్శనమిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రమాదకరమైన మద్యం బ్రాండ్స్ అమ్మకాలకు ఏపీ సీఎం అనుమతి ఇచ్చారని… ఇవి ప్రజల ప్రాణాలని తీస్తున్నాయని పలువురు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
మార్కెట్ లో బాగా సేల్ అయ్యే మద్యం బ్రాండ్స్ కాకుండా స్వలాభం కోసం ఏపీలో కొత్త కొత్త పేర్లతో మద్యాన్ని అమ్ముతున్నాడని మండి పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చనిపోగా, ఆయన బూమ్ బూమ్ బీర్ తాగడం వల్లనే చనిపోయాడని కొందరు ప్రచారాలు చేశారు.
ఇలా ఏపీ మద్యం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. రీసెంట్‌గా ఏపీ మద్యంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ సెటైరికల్ వీడియో చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ చేతితో సిగరెట్, మరో చేతిలో బూమ్ బూమ్ బీర్ బాటిల్ ను పట్టుకొని మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే… ఏపీ మద్యం ఇంకెంతో హానికరం అనేలా శ్రీకాంత్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బూమ్ బూమ్ బీర్ గ్లాసులో పోసుకుంటూ తనకు ఏమవుతుందో తెలీదు.. తనను మరిచిపోకుండా గుర్తు పెట్టుకోండని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. నేను బెజవాడలో ఉన్నాను. కొద్దిగా డిప్రెషన్ గా వుంటే బీరు తెచ్చుకున్నాను.
నేను తెచ్చుకున్నది మామూలు బీర్ కాదు (బూమ్ బూమ్ బీర్ బాటిల్ చూపిస్తూ). ఇంట్లో వాళ్లకు, మిత్రులు ఎవ్వరికీ చెప్పలేదు.. మీకే చెబుతున్నా. ఇది తాగుతున్నాను కానీ ఏమవుతుందో తెలీదు. ఏమయినా నన్ను మరిచిపోకుండా గుర్తుపెట్టుకొండి అని ఏపీ మద్యంపై తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేసారు శ్రీకాంత్.
ఏపీ మద్యం తాగితే ఏమవుతుందోనని కంగారు పడుతూ శ్రీకాంత్ చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన సరదాగానే వీడియో చేసినా కూడా దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే ఆయన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలలో ఎక్కువగా కనిపిస్తుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటారు.