Subhash Chandra Bose
విధాత: మొదటి నుంచీ జగన్ వెంట నడిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ (ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు) తొలిసారిగా అసమ్మతి గళం విప్పారు. తనకు కానీ తన కొడుకుకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే అని, తన ప్రాంతానికి వచ్చి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పెద్దరికం ఎలా చేస్తారని అంటున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలో జగన్‌ను ఎదిరించి కిక్కురుమనే ధైర్యం ఎవరూ చేయలేదు.
చాలా నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు ఉన్నా ఎవరూ ఇంతవరకూ నోరు విప్పలేదు కానీ తొలిసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం వేణుగోపాల కృష్ణ పెత్తనాన్ని సహించేది లేదని అంటున్నారు. టికెట్ కానీ ఇవ్వకుంటే తానూ వైసిపికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతాను అని తేల్చేసారు.
వాస్తవానికి 2009లో పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నుంచి గెలిచి వైఎస్సార్ కేబినెట్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేరారు. అయితే కొద్దిరోజుల్లోనే వైఎస్ మరణించగా జగన్‌కు మద్దతుగా అయన మంత్రి పదవిని వదులుకుని జగన్ వెంట నడిచారు.
అప్పట్లో ఎమ్మెల్యేలు జగన్ కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లగా 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో అయన ఓడిపోయారు. అంతేకాకుండా 2014లో రామచంద్రాపురంలో , 2019 లో మండపేటలో సైతం ఓడిపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రెవెన్యూ మంత్రిని, డెప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా అవకాశం ఇచ్చారు.
అయితే శాసన మండలి రద్దు అవుతుందన్న ఆలోచనతో ఆయన్ను రాజ్యసభకు పంపారు. ఇక ఇప్పుడు అయన కుమారుడు సైతం టికెట్ కోసం చూస్తున్నారు. వాస్తవానికి రెండుసార్లు బోస్ ఓడిపోవడంతో అక్కడ 2019లో గెలిచిన మంత్రి వేణుగోపాల కృష్ణ కాస్తా రామచంద్రాపురంలో వేళ్ళూనుకున్నారు. అక్కడ తనపట్టు తగ్గిపోతుండడంతో భరించలేని సుభాష్ ఇప్పుడు గొంతు విప్పుతున్నారు.
మొన్న ఒకసారి జగన్ ఈ బోసును, వేణుగోపాల కృష్ణను పిలిచి మాట్లాడారు.. తాను పరిస్థితి సరిదిద్దుతానని చెప్పి పంపించారు. కానీ మంత్రి హోదాలో వేణుగోపాల కృష్ణ దూకుడును తట్టుకోలేక, స్థానికంగా క్యాడర్ ను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు మళ్ళీ తన వాయిస్ పెంచారు.
పార్టీలో తానూ సీనియర్ని అని, తనను కాదని తన నియోజకవర్గంలో ఎవరు పెత్తనం సాగించినా ఒప్పుకునేది లేదని అంటున్నారు. మరి ఈ గ్రూపుల లొల్లి ఎలా సెటిల్ అవుతుందో చూడాలి.