సుఖ్‌దేవ్ సింగ్ హత్య కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సుఖ్‌దేవ్ సింగ్ హత్యతో రాజస్థాన్ అట్టుడికిపోయింది

న్యూఢిల్లీ : రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సుఖ్‌దేవ్ సింగ్ హత్యతో రాజస్థాన్ అట్టుడికిపోయింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రాజ్‌పుత్‌లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
అయితే ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హర్యానాలోని చండీఘర్‌లో శనివారం రాత్రి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ముగ్గురిలో రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ, ఉధం సింగ్ ఉన్నారు. రోహిత్, నితిన్ షూటర్లు అని పోలీసులు తేల్చారు.
వీరితో పాటు రామ్‌వీర్ జాట్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పులు జరిపిన అనంతరం రామ్‌వీర్.. షూటర్లు నితిన్, రోహిత్‌ను తన బైక్‌పై తీసుకెళ్లి అజ్మీర్ రోడ్డులో దించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదార ప్రకటించారు. షూటర్లు రోహిత్ గోదారతో కాంటాక్ట్‌లో ఉన్నారని తెలిపారు. మొబైల్ లోకేషన్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
అయితే నిందితులు హిసార్‌కు రైలులో వెళ్లి, అక్కడ్నుంచి ఉధంసింగ్‌తో కలిసి మనాలీకి వెళ్లినట్లు చెప్పారు. మండిలో ఒకరోజు ఉన్నామని తెలిపారు. మళ్లీ మండి నుంచి ముగ్గురం చండీఘర్‌కు వచ్చామని పోలీసులకు వివరించారు.