Teenmar Mallanna: సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై తీన్మార్ మల్లన్న!

Teenmar Mallanna: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా వేదికపై కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కనిపించడం చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వేదికపై చిరునవ్వులు చిందిస్తూ రేవంత్, మంత్రులతో పాటు కలిసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నుంచి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న బీసీ నినాదం ఎత్తుకుని…కాంగ్రెస్ లోని రెడ్డి మంత్రులు, నాయకులపైన, రెడ్డి సామాజిక వర్గంపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం గతంలో వివాదస్పదమైంది. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రక్రియను తప్పుబడుతూ మల్లన్న తీవ్ర విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన సొంత నియోజకవర్గం ఆలేరులో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కావడంతో పాటు ప్రోటోకాల్ మేరకు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఈ సభా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మల్లన్న మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా..లేక మల్లన్న సస్పెన్షన్ నామమాత్రమేనా అన్న చర్చలు జోరందుకున్నాయి.