Telangana
విధాత: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామంటున్నది. సెప్టెంబర్ 17పై కమ్యూనిస్టులు, ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాదనలు వారివి. అయితే బీజేపీ వాదనలు విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే నాటి స్వాతంత్ర్య సమరం, సాయుధ పోరాటంలో వాళ్ల పాత్ర ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో లేనివాళ్లు దేశభక్తి గురించి, సాయుధ పోరాటంలో పాల్గొనని వాళ్లు విమోచన దినం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది అనేది నాటి పోరాటంలో పాల్గొన్న వారి వాదన.
దేని నుంచి విమోచనం? ఎవరి నుంచి తెలంగాణ విమెాచనం? అన్నది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మాటల్లో చెప్పాలంటే.. ‘నిజాం పాలన నుంచి విమోచనం అన్నాం. కరెక్టే. నిజాం పాలన విమోచనం కోసమే ఆ ఉద్యమం నడిస్తే నిజాం పతనం తర్వాత పోరాటం ఆగిపోవాలి. నిజామును గద్దెదించడానికే పోరాటం జరిగితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అదే నిజాంను ఈ రాష్ట్రానికి రాజ్‌ప్రముఖ్‌గా, గవర్నర్‌గా నియమించకూడదు. నిజాం నుంచి విమోచనం అనుకుంటే నిజాంను మళ్లీ ఎట్లా గద్దెనెక్కించారనే ప్రశ్న ఉంటుంది.
కేవలం నిజాం పాలన నుంచే విముక్తి కొరకు కాదు, నిజాం పాలనలో వేళ్లూనుకున్నటువంటి, కరుడుగట్టినటు వంటి ఫ్యూడల్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి… దోపిడీ నుంచి విముక్తి కొరకు, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కొరకు పోరాటం జరిగిందని చెప్పుకుంటాం. అలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం పతనం తర్వాత కూడా మూడేండ్లు నడిచింది.
1948 సెప్టెంబర్ 17న నిజాం పదవీ భ్రష్టుడైన తర్వాత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 19 వరకు నడిచింది. కనుక ఆనాటి పోరాటం కేవలం నిజాంకు వ్యతిరేకమే కాదు, నిజాం పాలనలో బాగా బలపడిపోయినటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నడిచింది. ఆ వ్యవస్థలో జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. కనుక అది ప్రధానంగా దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం’.
సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్టులు. త్యాగాలు చేసింది వాళ్లే. ప్రాణాలు కోల్పోయింది వాళ్లే. హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య తర్వాత 1948లో జరిగిన మారణకాండపై నాటి కేంద్ర ప్రభుత్వం సుందర్ లాల్ కమిటీ వేసింది. ఆ నివేదిక ఇప్పటికీ గోప్యంగానే ఉన్నది. వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ తెలంగాణ అనగానే ముఖ్యంగా నిజాం ప్రభుత్వంపై జరిగిన ‘ఆపరేషన్ పో’లో అన్నది హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా చిత్రించి దాని ద్వారా నాలుగు ఓట్లు, సీట్లు దక్కించుకోవచ్చనేది ఆపార్టీ ఆలోచన.
అందుకే ఇక్కడ ఎన్నికల ప్రచారంలో నిజాం పాలన అంటూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. సంస్థానాల విలీనంలో నాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ బాధ్యతను నాటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆయనకు బీజేపీకి ఏ సంబంధం లేదు. కానీ ఆయనను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు. బీజేపీ చేసింది చెప్పుకోలేక ఇలా సున్నితమైన అంశాలను తెరమీదికి తెచ్చి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి చలి మంట కాచుకునే ప్రయత్నం చేయడం గర్హనీయం.