Nizamabad |
విధాత ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత న్యాయం చేయడం లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఏఎస్ పోశెట్టి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ మాట్లాడారు.
తెలంగాణ కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, తెలంగాణ వస్తే మా భవిష్యత్తు మారుతుందని ఆకాంక్షించి కుటుంబాలను పట్టించుకోకుండా లాఠీ దెబ్బలు తింటూ, ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించడం సరికాదన్నారు.
తెలంగాణ వచ్చి పదేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ఉద్యమకారులకు ఎలాంటి తోడ్పాటు ఇవ్వకపోవడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. ఉద్యమంలో పనిచేసి, వయసు పైబడుతున్న వారికి పెన్షన్ అందజేయాలని కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పదవుల్లో సముచిత న్యాయం చేయాలని అన్నారు. కేసీఆర్ ప్రకటించినట్లుగా ఉద్యమకారులకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించేలా ప్రోత్సహించాలని, సీట్లు కేటాయించాలని కోరారు. సమావేశంలో మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు ఏఎస్ పోశెట్టి, సీనియర్ నాయకులు ఈర్ల శేఖర్, కోనేరు సాయి కుమార్, గిరిధర్ యాదవ్ పాల్గొన్నారు.