GeM Portal | ఇకపై ప‌క్కాగా లెక్క‌..! కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా నూతన విధానం

కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా నూతన విధానానికి శ్రీకారం ఏ చిన్న వస్తువైనా కేంద్రం పరిధిలోని గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు జీఈఎం ప‌టిష్ట అమ‌లుకు కేంద్రం చ‌ర్య‌లు అక్టోబ‌ర్ 2నుంచి ప్రారంభం కానుందా? GeM Portal | విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులు గ్రామ పంచాయతీల్లో కొన్నిచోట వృథా అవుతున్నాయి. మరికొన్నిచోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. ఇక మీదట ఆ పరిస్థితి ఉండదు. వీటి కట్టడికి గతంలోనే ప్రవేశపెట్టిన జీఈఎం […]

  • Publish Date - August 14, 2023 / 12:09 PM IST
  • కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా నూతన విధానానికి శ్రీకారం
  • ఏ చిన్న వస్తువైనా కేంద్రం పరిధిలోని గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు
  • జీఈఎం ప‌టిష్ట అమ‌లుకు కేంద్రం చ‌ర్య‌లు
  • అక్టోబ‌ర్ 2నుంచి ప్రారంభం కానుందా?

GeM Portal | విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులు గ్రామ పంచాయతీల్లో కొన్నిచోట వృథా అవుతున్నాయి. మరికొన్నిచోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. ఇక మీదట ఆ పరిస్థితి ఉండదు. వీటి కట్టడికి గతంలోనే ప్రవేశపెట్టిన జీఈఎం పోర్టల్‌ను కేంద్రం మరింత పటిష్ఠంగా అమలుచేయనుంది. ఈ నూతన విధానంపై స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోవడంతో కొంత జాప్యం జరుగుతున్నా, మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకోనున్నారు.

నిధుల ఖర్చు లెక్క ఇకపై పక్కాగా

స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి మంజూరవుతున్న నిధుల ఖర్చు లెక్క ఇకపై పక్కాగా ఉండనుంది. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి మంజూరవుతున్న నిధుల ఖర్చు లెక్క ఇకపై పక్కాగా ఉండనుంది. కేంద్ర సర్కార్‌ విడుదల చేస్తున్న నిధులు గ్రామ పంచాయతీల్లో వృథాగా ఖర్చు చేయడంతోపాటు దుర్వినియోగం కాకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచే ఈ విధానం అమలులోకి రానుంది.

ఇకపై ఏ చిన్న వస్తువైనా కేంద్రం పరిధిలోని గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఇక నుంచి ఈ వెబ్‌సైట్‌ ద్వారానే కొనుగోలు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కొనుగోళ్లు ఎవరి పేరిట చేయాలో నిర్దేశించడంతోపాటు నగదు రహిత, పారదర్శక లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ విధానం అమలులోకి తీసుకుని వచ్చినట్టు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.

బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ

కేంద్ర సర్కారు ఇటీవలి కాలంలో స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నది. ప్రస్తుతానికి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఆరు నెలలుగా ఈ నిధులు విడుదల కాలేదు. ప్రతీ నెలా ఒక్కో జిల్లాకు జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తారు.

వీటిలో జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీల వాటా 85 శాతం, మండల పరిషత్‌కు 10 శాతం, జిల్లా పరిషత్‌కు 5 శాతం కేటాయిస్తారు. వీటిని గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా బిల్లులు పెట్టి విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు. కాబ‌ట్టి కొత్త విధానం అమలులోకి రావడంతో స్థానిక సంస్థల్లో నిధుల వ్యయం పూర్తిగా పారదర్శకంగా ఉండనున్న‌ట్లు తెలుస్తోంది.

అన్నీ వెబ్‌సైట్ ద్వారానే

స్థానిక సంస్థలు ఇకపై ఏ చిన్న వస్తువైనా కేంద్రం పరిధిలోని జీఈఎం (గవర్నమెంట్ ఈ-మార్కెట్) వెబ్సైట్ ద్వారా నిధుల వ్యయం, కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో సర్పంచులు, ఉప సర్పంచులు, మండల పరిషత్లో ఎంపీడీఓలు, జిల్లా, పరిషత్ చైర్మన్, సీఈఓల పేరిట నిధుల వ్యయం చేయాల్సి ఉంటుంది.

నూతన విధానం ద్వారా పంచాయతీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ మొదలుకొని ఏ వస్తువు కొనుగోలు చేసినా ప్రత్యేక పోర్టల్‌ ద్వారా కేంద్రానికి చేరుతుంది. రూ.25 వేల వరకు నేరుగా కొనుగోలు చేసేందుకు అవకాశముంది. రూ.లక్ష వరకు జీఈఎం వెబ్‌సైట్‌లోని సంస్థల వివరాలను పరిశీలించి ఏ కంపెనీలో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయో ఆ సంస్థ నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు మించి కొనుగోలు చేస్తే బిడ్డింగ్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది.

ఇప్పటి వరకు చేసిన పనులపై ఆడిట్‌

పంచాయతీల్లో ఇప్పటి వరకు చేసిన పనులపై ఆడిట్‌ జరగనుంది. స్టేట్‌, ఏజీ స్థాయిలో ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. ఏజీ స్థాయిలో ఏవైనా కొన్ని పంచాయతీల్లో శాంపిల్‌ పద్ధతిలో ఆడిట్‌ నిర్వహిస్తారు. 2022-23కు సంబంధించి నిధుల ఖర్చుపై ప్రస్తుతం జిల్లాలో రాష్ట్రస్థాయి ఆడిట్‌ 60 శాతం వరకు పూర్తయింది. గ్రామ పంచాయతీ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ ప్రకారమే మండలస్థాయిలో బ్లాక్ డెవల్‌ప్ మెంట్‌ ప్లాన్‌, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ డెవలప్ మెంట్‌ ప్లాన్‌ ప్రకారం సర్కారుకి ప్రతిపాదనలు పంపిన విధంగానే ఖర్చు చేశారా లేదా అనేది ఆడిట్‌లో తేలిపోతుంది.

అమ‌ల్లోకి నూత‌న విధానం

కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రస్తుతం 15వ ఆర్ధిక సంఘం నిధులు కొంత మేర మంజూరు కాగా, మరి కొన్ని కావాల్సి ఉంది. వీటి మంజూరు నుంచే జీఈఎం ప్రత్యేక పోర్టల్ అమల్లోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన జిల్లాలోని 500 పంచాయతీలకు 85 శాతం, 20 మండల పరిషత్ లకు 10 శాతం, జిల్లా పరిషత్ కు 5 శాతం చొప్పున కేటాయిస్తున్నారు.

వీటి వ్యయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించి, వాటిని ఆమోదించాకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో 60 శాతం తాగునీటి అవసరాలు. పారిశుద్ధ్యానికి కచ్చితంగా ఖర్చు చేయాలి. మిగతా 40 శాతం ఇతర అవసరాలకు నిబంధనల మేరకు ఖర్చు చేయాలి.