ఆ ఒక్కటే రైతుల కీలక డిమాండ్‌!

పంజాబ్‌, హర్యానా సరిహద్దు వద్ద నెలకొన్న గందరగోళ స్థితి నేపథ్యంలో మంగళవారం రాత్రి అక్కడే బస చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

ఆ ఒక్కటే రైతుల కీలక డిమాండ్‌!
  • దానిపైనే మంత్రులు, నేతల చర్చల్లో సందిగ్ధత
  • కనీస మద్దతు ధర డిమాండ్‌ చేస్తున్న రైతులు
  • ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్న కేంద్ర మంత్రులు
  • చర్చల్లో ప్రతిష్ఠంభన.. రాత్రికి పంజాబ్‌-హర్యానా సరిహద్దు వద్దే రైతులు
  • బుధవారం తిరిగి ఢిల్లీకి యాత్ర



న్యూఢిల్లీ: పంజాబ్‌, హర్యానా సరిహద్దు వద్ద నెలకొన్న గందరగోళ స్థితి నేపథ్యంలో మంగళవారం రాత్రి అక్కడే బస చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. బుధవారం ఉదయం మళ్లీ ఢిల్లీకి యాత్ర కొనసాగుతుందని ప్రకటించాయి. రైతులపై మంగళవారం జరిగిన బాష్పవాయు ప్రయోగం, నీటి ఫిరంగుల కారణంగా దాదాపు వందమంది రైతులు గాయపడ్డారని రైతు సంఘాలు తెలిపాయి. తమ యాత్రను అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు బారికేడ్లు పెట్టడంతో ఆగ్రహించిన రైతులు.. వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.


దీంతో పోలీసులు వారిని నిలువరించేందుక బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. కొన్నింటిని డ్రోన్లు ఉపయోగించి కూడా వదిలారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. పలు చోట్ల ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేయడంతో తీవ్ర వాహన రద్దీ కనిపించింది. రైతుల ఆందోళనను విరమింప చేసేందుకు కేంద్రమంత్రులు రైతు సంఘాలతో ఐదు గంటలపాటు చర్చించినా ఏకాభిప్రాయం లభించలేదు. పంజాబ్‌, హర్యానా సరిహద్దు వద్ద పదివేల మంది రైతులు ఉన్నారని రైతు నాయకుడు సర్వణ్‌సింగ్‌ పాంధేర్‌ చెప్పారు.


2020-21 నాటి ఆందోళన సమయంలో పెట్టిన కేసులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినా.. రైతుల కీలక డిమాండ్‌ అయిన కనీస మద్దతు ధర చట్టంపై మాత్రం రైతులను కేంద్ర మంత్రులు ఒప్పించలేక పోయారు. గత రైతు ఆందోళనల సందర్భంగా చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించినా.. అత్యంత కీలకమైన ఎంఎస్పీపై మాత్రం కేంద్రం దిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.