లవ్ ఎట్ ఫస్ట్ సైట్!
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే కావచ్చు. మొబైల్ ఫోన్‌లో కనిపించిన ఓ యువతి ఫొటో చూసి ప్రేమలో పడిపోయాడు. చేసుకుంటే ఆమెనే పెండ్లి చేసుకుంటాను.

- ఫొటోచూసి ప్రేమించిన పశ్చిమబెంగాల్ యువకుడు
- ప్రియుడిని పెళ్లాడేందుకు భారత్ వచ్చిన పాక్ యువతి
- అంగీకరించిన ఇరు కుటుంబాలు.. జనవరిలో పెండ్లి
విధాత: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే కావచ్చు. మొబైల్ ఫోన్‌లో కనిపించిన ఓ యువతి ఫొటో చూసి ప్రేమలో పడిపోయాడు. చేసుకుంటే ఆమెనే పెండ్లి చేసుకుంటాను. లేకపోతే.. అసలు పెండ్లే చేసుకోను అని భీష్మించాడు. ఆమెను వెతికి తనకు పెండ్లి చేయాలని తల్లిదండ్రులను కోరాడు. అతడే పశ్చిమబెంగాల్‌కు చెందిన సమీర్‌ఖాన్. యువతి గురించి వాకబు చేయగా, పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందిన జవేరియా ఖానమ్‌గా తెలిసింది. తమ కుమారుడితో పెండ్లి ప్రతిపాదన పంపగా, యువతి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దాంతో ఐదేండ్ల వీరి ప్రేమ కథ జనవరిలో జరిగే వీరి వివాహంతో శుభం కార్డు పడనున్నది. ఓ యువకుడి ప్రేమ కథ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పశ్చిమబెంగాల్‌కు చెందిన సమీర్‌ఖాన్ అనే యువకుడు జర్మనీలో చదివాడు. అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఐదేండ్ల క్రితం 2018లో అతడు కుటుంబసభ్యులను చూసేందుకు భారత్‌కు వచ్చాడు. అప్పుడు అతడు తన తల్లి మొబైల్ ఫోన్‌లో ఒక యువతి ఫొటోను చూసి ఇష్టపడ్డాడు. ఆమె అందానికి ముగ్దుడయ్యాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పేరెంట్స్‌పై ఒత్తిడి తెచ్చాడు. కొడుకు కోరిక కాదనలేక సదరు యువతి గురించి వారు ఆరా తీశారు. ఆ యువతి కరాచీకి చెందిన జవేరియా ఖానమ్ అని తెలుసుకున్నారు. యువతి పేరెంట్స్ ఫోన్‌నంబర్ కనుకొని వారితో మాట్లాడారు. ఇరు కుటుంబాల వివరాలు తెలుసుకున్న తర్వాత పెండ్లి ప్రతిపాదన పెట్టారు. యువతి పేరెంట్స్ కూడా పెండ్లికి ఓకే చెప్పారు.
భారత యువకుడు, పాక్ యువతి పెండ్లి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. సమీర్‌ఖాన్ ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా విజృంభింది. జవేరియా ఖానమ్ భారత్‌కు వచ్చేందుకు రెండు సార్లు చేసిన వీసా ప్రయత్నాలు తిరస్కరణకు గురయ్యారు. ఇలా ఐదేండ్లు పూర్తయ్యాయి. కానీ, జవేరియా, సమీర్‌ఖాన్ కలుసుకోకపోయినా మొబైల్‌లో తమ ప్రేమ బంధాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జవేరియా ఖానమ్‌కు 45 రోజుల గడువుతో భారత్ వీసా ఇచ్చింది. దాంతో మంగళవారం అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దును దాటి ఖానమ్ భారత్‌లోకి అడుగు పెట్టింది. సమీర్ తన కాబోయే భార్య జవేరియాను బోర్డర్‌లో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికాడు. జనవరిలో ఆ ఇద్దరు ప్రేమికులు పెండ్లి చేసుకోనున్నారు.