ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఐదోసారి కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.
Fixed Deposits | ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఐదోసారి కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. 6.5 శాతంగా ఉంచింది. ఈ క్రమంలోనే పలు బ్యాంకులు డిపాజిటర్లకు శుభవార్తను చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రెపో రేట్లను గతేడాది మార్చి నుంచి ఆర్బీఐ పెంచగా.. గత మూడు దఫాలుగా రెపో రేటు స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్నది.
సాధారణంగా ఆర్బీఐ రెపో రేట్లు పెంచితే.. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ వస్తాయి. అయితే రెపోరేటు యథాతధంగా ఉన్నా వడ్డీని అందిస్తూనే వస్తున్నాయి. డిసెంబర్లో నాలుగు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఏ బ్యాంకులు, ఎంత వడ్డీ రేటును పెంచిందో తెలుసుకుందాం.!
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ ఒకటి నుంచి కస్టమర్లకు రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల ఎఫ్డీపై వడ్డీరేట్లను పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను తక్కువ కాలానికి అంటే.. 46 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితికి 5.25శాతం, 91 రోజుల నుంచి 179 రోజులు కాలపరిమితికి 6శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితికి 6.00శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల కాలపరిమితికి 6.25శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితిపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తాజా సవరణ తరువాత కోటక్ బ్యాంక్ ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితిపై 2.75శాతం నుంచి 7.25శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.80శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు 11 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి.
డీసీబీ బ్యాంక్
డీసీబీ బ్యాంక్ కొత్త రేటు డిసెంబర్ 13 నుంచి అమలులోకి వస్తాయి. సవరించిన తర్వాత బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60శాతం అత్యధిక ఎఫ్డీ రేటును అందిస్తున్నది. తాజాగా పెంపు తర్వాత డీసీబీ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి పదేళ్ల మెచ్యూరిటీ ఎఫ్డీలపై 3.75శాతం నుంచి 8 శాతం వరకు, వృద్ధులకు 4.25శాతం నుంచి 8.60శాతం వరకు ఎఫ్డీ రేటును అందిస్తున్నది.
ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఈ నెల 5 నుంచి సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లపై వడ్డీ రేటును 500 రోజులకు 7.50శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు 500 రోజుల కాలపరిమితికి గరిష్ఠంగా 8.15శాతం, 21 నెలల నుంచి మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితికి 7.80శాతం వడ్డీని ఇవ్వనున్నది.