MLA Kotha Prabhakar Reddy: ప్రభుత్వాన్ని కూల్చమంటున్నరు..పైసలు కూడా ఇస్తరట: దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని.. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • By: Somu    latest    Apr 15, 2025 12:14 PM IST
MLA Kotha Prabhakar Reddy: ప్రభుత్వాన్ని కూల్చమంటున్నరు..పైసలు కూడా ఇస్తరట: దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Kotha Prabhakar Reddy:

కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని.. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని..కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదని.. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. నియోజకవర్గంలోని తోగుటా మండలం బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

భగ్గుమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారనడానికి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు నిదర్శనమని తక్షణమే ఆయనను విచారించాలని కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రె ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నాయకులు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో అర్ధమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రలోభాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగబోరన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు 7లక్షల కోట్ల ప్రజాధనంలో దోచుకున్న సొమ్మును బిల్డర్లు, పారిశ్రామిక వేత్తల వద్ధ దాచారని..ఇప్పుడు ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నానన్నారు.

కేసీఆర్ ఆలోచనల మేరకే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు : మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారని..వారి తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం బెదరబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పొంగులేటి ఘాటుగా స్పందించారు. కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల కొనండన్న కేసీఆర్ ఆలోచనల మేరకే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో.. కొనండి అని పొంగులేటి సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చి తండ్రి కొడుకుల ఆ కుర్చీలో కూర్చోవాలనే వారి ఆలోచన అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ అని..ఆయన మాటలను కేసీఆర్ మాటలుగానే చూడాలన్నారు. ధరణితో కొల్లగొట్టిన భూములన్ని భూ భారతి అమలుతో వెనక్కి వెలుతాయన్న భయంతో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చే మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.