Gone Prakash Rao: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఫోన్ ట్యాపింగ్ ఇదే! : గోనే ప్రకాశ్ రావు

కేటీఆర్, సంతోష్ రావులు కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు
కేసీఆర్ ఆదేశాలతోనే కవిత ఫోన్ ట్యాప్
విధాత, హైదరాబాద్: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఫోన్ ట్యాపింగ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే ప్రకాశ్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కు తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రావు హూజురాబాద్ ఉప ఎన్నిక నుంచి నా ఫోన్ ట్యాప్ చేశారని..మునుగోడు ఉప ఎన్నికలోనూ విచ్చలవిడిగా ట్యాప్ చేశారన్నారు. నా ప్రైవసీకి ఎలా భంగం కలిగిస్తారని ప్రశ్నించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని..చివరకు కల్వకుంట్ల కవిత ఫోన్ కూడా కేటీఆర్, సంతోష్ రావులు ట్యాపింగ్ చేయించారని ప్రకాశ్ రావు తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతోనే వాళ్లు కవిత ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి ప్రమోషన్లు ఇచ్చారని వెల్లడించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ చేశారని..ఆగస్టు 5తర్వాతైనా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును అరెస్టు చేసి కస్టోడియల్ విచారణ చేస్తారన్నారు. అన్ని వేళ్లు ఈ కేసులో కేసీఆర్ ను సూత్రధారిగా చూపుతున్నాయని..ఆయన తప్పించుకోలేరని ప్రకాశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, నందకుమార్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ సీబీఐతో ఎంక్వయిరీ జరిపించాలని గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు.