విధాత: ముగ్గురు మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్టు చేసి 1.8 లక్షల విలువైన 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని మిర్యాలగూడ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.సురేష్ తెలిపారు. బుధవారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బుధవారం ఉదయం స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పల్సర్ బైక్‌పై వెళ్తుండగా ఆపగా పారి పోయేందుకు యత్నించారన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మిర్యాలగూడ పట్టణం, దామరచర్ల మండలంలో బైకులు దొంగతనం చేశామని ఒప్పుకున్నారన్నారు.
చోరీ చేసిన బైక్‌లను, స్మార్ట్ ఫోన్ వెంటనే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు మిర్యాలగూడ మండలం దుర్గానగర్‌కు చెందిన అవిరెండ్ల శశిప్రీతం, మిర్యాలగూడ పట్టణం అశోక్ నగర్‌కు చెందిన పాతులోతు గౌతం, బాపూజీ నగర్‌కు చెందిన సకినాల మణిదీపిక నాయుడుగా గుర్తించామన్నారు.
వారిని స్థానిక జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించారని తెలిపారు. శశిప్రీతం నాచారం పోలీస్ స్టేషన్‌లో బైకుల దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన వాడన్నారు. బైకుల దొంగలను అరెస్టు చేసిన అధికారులను డిఎస్పి అభినందించారు. సమావేశంలో ఎస్ఐలు కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.