Chandrayaan-3 | ఈ రోజు.. మీ నోరు మూయించాం! న్యూయార్క్‌ టైమ్స్‌ కార్టూన్‌కు భారతీయుల కౌంటర్‌

Chandrayaan-3 | విధాత, న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో 2014లో న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన ఒక కార్టూన్‌ మళ్లీ సోషల్‌మీడియాలోకి వచ్చింది. అంగారకుడి పరిశీలనకు ఉద్దేశించిన మంగళ్‌యాన్‌ మిషన్‌ సందర్భంగా ఈ కార్డూన్‌ ప్రచురించారు. అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ మిషన్‌.. 450 కోట్ల రూపాయలతోనే పూర్తయింది. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్వహించిన గ్రహాంతర మిషన్‌ ఇది. అంతకు ముందు అమెరికా, రష్యా, యూరప్‌లు అంగారకుడి పైకి ఉపగ్రహాలు పంపాయి. […]

Chandrayaan-3 | ఈ రోజు.. మీ నోరు మూయించాం! న్యూయార్క్‌ టైమ్స్‌ కార్టూన్‌కు భారతీయుల కౌంటర్‌

Chandrayaan-3 |

విధాత, న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో 2014లో న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన ఒక కార్టూన్‌ మళ్లీ సోషల్‌మీడియాలోకి వచ్చింది. అంగారకుడి పరిశీలనకు ఉద్దేశించిన మంగళ్‌యాన్‌ మిషన్‌ సందర్భంగా ఈ కార్డూన్‌ ప్రచురించారు.

అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ మిషన్‌.. 450 కోట్ల రూపాయలతోనే పూర్తయింది. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్వహించిన గ్రహాంతర మిషన్‌ ఇది. అంతకు ముందు అమెరికా, రష్యా, యూరప్‌లు అంగారకుడి పైకి ఉపగ్రహాలు పంపాయి. మంగళ్‌యాన్‌ విజయవంతం అయినప్పుడు న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కార్టూన్‌ భారతదేశ విజయాన్ని కించపర్చేలా ఉన్నది.

ఆ కార్టూన్‌లో.. ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. పంచె, తలకట్టుతో ఒక బర్రెను వెంట బెట్టుకుని వచ్చిన భారత గ్రామీణుడు తలుపు తీయాలంటూ అద్దంతో ఉన్న డోరుపై కొడుతుంటాడు! ఆ గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇతనివైపు గుర్రుగా చూస్తూ ఉంటారు. వారి చేతిలో ఉన్న పత్రికలో ఇండియాస్‌ మార్స్‌ మిషన్‌ అని రాసి ఉంటుంది.

అప్పట్లోనే ఈ కార్టూన్‌పై తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. భారతదేశం సాధించిన విజయాన్ని కించపర్చడమే కాకుండా.. న్యూయార్క్‌ టైమ్స్‌ జాతి వివక్షను ఈ కార్టూన్‌ చాటుతున్నదని అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పత్రిక దిగి వచ్చి క్షమాపణ చెప్పక తప్పలేదు. ఆ సమయంలో పత్రిక ఎడిటోరియల్‌ పేజీ సంపాదకుడిగా ఉన్న ఆండ్రూ రోసెంథల్‌.. ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు పెడుతూ.. ‘ఈ కార్టూన్‌పై పెద్ద సంఖ్యలో పాఠకులు ఫిర్యాదు చేశారు.

ఈ కార్టూన్‌ వేసిన హెంగ్‌ కిమ్‌ సాంగ్‌ అసలు ఉద్దేశం.. అంతరిక్ష పరిశోధనలు ఇక ఏ మాత్రం ధనిక, పశ్చిమ దేశాల సొత్తు కాదని చెప్పడమే. అంతర్జాతీయ వ్యవహారాల గురించి పరిశీలనలు చేసేటప్పుడు హెంగ్‌ వాడే చిత్రాలు, పదాలు కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టేవిగా ఉంటాయి. ఈ కార్టూన్‌లో వాడిన చిత్రాలతో బాధపడిన పాఠకులందరికీ క్షమాపణలు చెబుతున్నాం’ అని పేర్కొన్నారని బీబీసీ పేర్కొంటున్నది.

భారతదేశాన్ని, దాని ప్రభుత్వాన్ని లేదా ప్రజలను వ్యతిరేకించాలన్న ఉద్దేశం హెంగ్‌కు లేదని కూడా రోసెంథల్‌ చెప్పకొచ్చారు. చంద్రయాన్‌ -3 దిగ్విజయం సాధించిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు.. ఈ పాత కార్టూన్‌ను వెలికి తీసి.. ‘ఇప్పుడు మీ నోరు మూయించాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజా పరిస్థితులలో న్యూయార్క్‌ టైమ్స్‌ సరికొత్త కార్టూన్‌ ప్రచురించాలని అన్నారు.

కొంతమంది మూడేళ్ల క్రితం ఇదే కార్టూన్‌ను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మార్పులు చేసి ప్రచురించిన దానిని రీపోస్ట్‌ చేశారు. అందులో ఎలైట్‌ క్లబ్‌ అనే రూంలో భారతీయుడు ఉంటాడు. బయట పశ్చిమదేశాల వారు రాకెట్లు పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు.

ఈ కార్టూన్‌ను మూడేళ్ల క్రితం ఒకేదఫాలో 104 ఉపగ్రహాలను ఇస్రో రికార్డు స్థాయిలో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టినప్పుడు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. కొంతమంది ఈ కార్టూన్‌ను కూడా మరింత మార్చి.. చంద్రుని దక్షిణ ధృవంపై ఎలా దిగాలో భారతదేశం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు రూపొందించారు.