గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మరోసారి రద్దు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మరోసారి రద్దు

విధాత‌: తెలంగాణలో టీఎస్‌ఫీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్‌ 11న జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగిన విషయం విదితమే. అయితే పరీక్షలో బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హాల్‌ టికెట్‌ నంబర్‌ లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.

గతంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఈ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దుచేయాలని కోరుతూ నలుగురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో చాలా లోపాలున్నాయని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అందులో ప్రధానంగా ఓఎంఆర్‌ షీట్‌పై అభ్యర్థుల హాల్‌ టికెట్‌ నంబర్‌, ఫొటో, బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించిన సమయంలో పాటించిన నిబంధనలను జూన్‌లో నిర్వహించినప్పుడు ఎందుకు పాటించలేదని వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలను అరికట్టడానికి కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టుఆ సందర్భంగా టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించింది.

పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్‌పీఎస్సీ విచక్షణ అధికారమని సర్వీస్‌ కమిషన్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు. బయోమెట్రిక్‌, ఓంఎంఆర్‌పై ఫొటోకు దాదాపు రూ. 1. 50 కోట్లు ఖర్చవుతుందిన టీఎస్‌పీఎస్సీ న్యాయస్థానానికి తెలపింది. పరీక్షల నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రశ్నపత్రాల లీకేజీలతో ఇప్పటికే నిరుద్యోగ అభ్యర్థులు చాలా నష్టోయారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రెండుసార్లు రద్దు కావడం సర్వీస్‌ కమిషన్‌ పనితీరు ఎంత లోపభూయిష్టంగా ఉన్నదని తెలియజేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.