విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు కూలీలు మృతి
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో దారుణం జరిగింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు

- సిమ్లా శివార్లలో దారుణం
విధాత: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో దారుణం జరిగింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జుంగా రోడ్డులోని అశ్వని ఖుద్ సమీపంలో కొండచరియలు విరిగిపడి బీహార్‌కు చెందిన రాకేశ్ (31), రాజేశ్ (40) మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
కొందరు కూలీలు స్టోన్ క్రషర్ సమీపంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అక్కడ పని చేసే కూలీలు గుడిసెల్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు ఒక్కసారిగా విరిగి గుడిసెలపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు తృటిలో తప్పించుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు మట్టి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారు.
మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం దవాఖానకు పంపినట్టు సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ మీడియాకు తెలిపారు. తదుపరి విచారణ జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.