బీజేపీకి 350కి పైగా సీట్లు ఖాయం: అమిత్ షా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 350 నుండి 400 సీట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు

  • By: Somu |    latest |    Published on : Dec 28, 2023 2:48 PM IST
బీజేపీకి 350కి పైగా సీట్లు ఖాయం: అమిత్ షా
  • పార్లమెంటు ఎన్నికలు దేశ భవిష్యత్తుకు దిక్సూచీ
  • వర్గపోరుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయాం
  • ఇకనైనా కలిసి పని చేయండి
  • మరో కుటుంబ పాలనలోకి తెలంగాణ
  • సిటింగ్‌లకు మళ్లీ ఛాన్స్‌
  • తెలంగాణ బీజేపీ సమీక్షలో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా



విధాత : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 350 నుండి 400 సీట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని, మూడోసారి వరుసగా ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడుతారని అమిత్ షా స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కొంగరకలాన్‌లోని శ్లోక సమ్మేళనంలో పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త.. పార్టీ నాది, దేశం మనది అనే భావనతో పని చేయాలని పిలుపునిచ్చారు. అలా పని చేస్తే.. తప్పకుండా కేంద్రంలో మళ్లీ సంపూర్ణ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.


ఇందుకోసం ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తల్ని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికలు ఒక వ్యక్తికి చెందినవి కావని.. దేశానికి, దేశ భవిష్యత్తుకు సంబంధించినవని, దేశ ప్రగతికి దిక్చూచీ వంటివని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని, దానికి వేవ్ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి మరో కుటుంబ పాలనలోకి పడిపోయారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు, ఓట్ల శాతం పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సిందని అన్నారు.


తెలంగాణ బీజేపీ నేతల్లో అంతర్గత వర్గపోరుతో పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయిందని, తాను 30సీట్ల మేరకు బీజేపీ గెలుస్తుందని భావించానన్నారు. ఇకనైనా విభేదాలు మరిచిపోయి 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకుల్ని అమిత్ షా ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను లక్ష్యంగా చేసుకుని మరింత కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.


పార్టీ స్థితిగతులపై నిర్వహించే సర్వే ఆధారంగా సిటింగ్‌ ఎంపీలు, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను గుర్తించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని నాయకులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు.


కలహాలు మాని కలిసి పనిచేయాలి


బీజేపీ ముఖ్యనేతల మధ్య కోల్డ్‌వార్‌పై అమిత్ షా సీరియస్ అయ్యారు. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్‌రెడ్డిని ఆదేశించారు. కొంగర కలాన్ సమావేశానికి ముందు అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.


అంతకుముందుశంషాబాద్ నోవాటెల్‌లో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేతల మధ్య కోల్డ్ వార్‌పై ఫోకస్ చేసిన నేపథ్యంలో బండి, ఈటల, కిషన్‌రెడ్డిలతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. కొత్త ప్రభుత్వం పాలన, రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు.


పరస్పర విమర్శలు ఆపి పార్టీ కోసం పనిచేయాలని నేతలకు అమిత్ షా సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ చేసే అవకాశమిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ బరిలో నిలవనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ బరిలో బండి సంజయ్, నిజామాబాద్ లోక్‌సభ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీలు పని చేసుకుంటూ పోవాలని చెప్పినట్లు సమాచారం.


బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై చర్చ..


బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగింది. బీసీ‌ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్‌గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బావుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, గరికపాటి, చాడా సురేష్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.


మెజార్టీ సీట్లు గెలువాలన్నారు


2024 ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని ఈటల రాజేందర్‌, ఎంపీ లక్ష్మణ్‌లు అన్నారు. గురువారం అమిత్ షా సమీక్షా సమావేశం అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు. వందేళ్ల ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తికాబోతుందని, మోడీ పాలనలో దేశంలో ఎక్కడ ఏర్పాటు ఉద్యమాలు లేవని, బలుచిస్తాన్ కూడా భారత్ లో కలవాలని కోరుకుంటుందన్నారు. ప్రపంచంలోనే ఐరెన్ మ్యాన్ అని మోడీ పేరు తెచ్చుకున్నారన్నారు.


రాబోయే ఎన్నికల్లో మళ్లీ మోడీ సారధ్యంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఒక్క స్కాం లేకుండా పదేళ్ల పాలన సాగించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా బీజేపీ కి అండగా నిలవాలని,17 సీట్లు గెలవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 10 పార్లమెంటు స్థానాలకు పైగా విజయం సాధిస్తామని, 30% ఓట్లు సాధిస్తామన్నారు. మోడీ ప్రభుత్వం దళారి వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వందల కోట్లు ఖర్చు పెట్టి బీఆరెస్‌-బీజేపీ ఒక్కటేనని అసత్య ప్రచారం చేసిందన్నారు.


తీవ్ర ప్రలోభాల మధ్య కూడా బీజేపీ గతంలో కంటే మెరుగైన ఓట్లు సీట్లు వచ్చాయని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటేయబోతున్నారన్నారు. బీఆరెస్‌ ప్రజా వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లాభపడిందని, ఇప్పుడు బీఆరెస్‌ మునిగిపోయిన పడవ అయితే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, బీజేపీ వికసించే కమలమన్నారు. సేమీఫైనల్‌గా అభివర్ణించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందని, మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తుందనడానికి ఆ విజయాలే సంకేతమన్నారు.