విధాత: భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా పరుగులు తీస్తున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైళ్లలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను ప్రయాణికులకు కల్పిస్తున్నది. ఇప్పటి వరకు 33 మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో వెళ్లడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో రైళ్లకు భారీగా డిమాండ్ ఉన్నది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉన్న నేపథ్యంలో పండగల సీజన్‌లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. అయితే, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే, ఎంత దూరమైనా కేవలం కూర్చొని ప్రయాణం చేసే వీలుమాత్రమే ఉన్నది. త్వరలోనే వందేభారత్‌లో స్లీపర్ బెర్తులను సైతం తీసుకురాబోతున్నది. 2024 ఫిబ్రవరి వరకు ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భావిస్తున్నది.
అయితే, స్లీపర్ వందే భారత్ రైళ్లు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది. వీటికి సంబంధించిన డిజైన్‌ను విడుదల చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో రైలులో దాదాపు 857 బెర్తులను ఏర్పాటు చేయబోతుండగా.. ఇందులో 823 బెర్తులను రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉండనున్నది. మిగతా బెర్తులను రైలులో సేవలందించే ఉద్యోగులు, సిబ్బందికి కేటాయించనున్నారు.
ఇక ఒక్కో కోచ్‌లో నాలుగు బదులు మూడు టాయ్‌లెట్స్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఓ మినీ ప్యాంట్రీ ఉండనున్నది. దివ్యాంగులకు అనువుగా ఉండేలా ర్యాంప్ సైతం డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, వందేభారత్ స్లీపర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని ఇచ్చేలా బెర్తులతో పాటు అన్ని సదుపాయాలను తీర్చిదిద్దింది.