TV9 Vs Ntv | నాడు నారాయణ, చైతన్య.. నేడు TV9, NTV

TV9 Vs Ntv విధాత: ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో నారాయణ, చైతన్య విధ్యార్థులదే హవా.. ఒకటి నుంచి వంద ర్యాంకులు మావే.. తరాలు మారినా చెరగని ర్యాంకులంటూ నిన్న మొన్నటి వరకు ఆ కాలేజీ యాజమాన్యాలు పలు మీడియాల్లో ప్రకటించుకోవడం చూశాం. కానీ ఇప్పుడు వాళ్లను తలదన్నేలా ఆ మీడియా ఛానళ్లే మేం నంబర్ వన్ అంటే మేమే నంబర్ వన్ అంటూ తన్నుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చుకుంటు రోడ్డున పడుతున్నాయి. రెండు రోజుల క్రితం […]

  • By: krs    latest    Jun 02, 2023 2:19 AM IST
TV9 Vs Ntv | నాడు నారాయణ, చైతన్య.. నేడు TV9, NTV

TV9 Vs Ntv

విధాత: ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో నారాయణ, చైతన్య విధ్యార్థులదే హవా.. ఒకటి నుంచి వంద ర్యాంకులు మావే.. తరాలు మారినా చెరగని ర్యాంకులంటూ నిన్న మొన్నటి వరకు ఆ కాలేజీ యాజమాన్యాలు పలు మీడియాల్లో ప్రకటించుకోవడం చూశాం. కానీ ఇప్పుడు వాళ్లను తలదన్నేలా ఆ మీడియా ఛానళ్లే మేం నంబర్ వన్ అంటే మేమే నంబర్ వన్ అంటూ తన్నుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చుకుంటు రోడ్డున పడుతున్నాయి.

రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ మీడియా సంస్థ(Tv 9) తమ పోటీ ఛానల్( N tv) కుట్ర, మోసంతో నెంబర్ వన్ ఛానల్‌ గా ప్రకటించుకున్న‌దని.. మాది మాత్రమే నిజమైన నెంబర్ వన్ ఛానల్ అంటూ ప్రకటించుకుని ఆర్భాటం చేసింది.

ప్రత్యర్ధి ఛానెల్ పై మాటల తూటాలు పేలుస్తూ, నగరం అంతా బ్యానర్లు, కటౌట్లు కట్టి చాలా హడావుడి చేశారు. పైపెచ్చు ఇది ప్రజా ప్రయోజనార్ధం జారీ అంటూ ట్యాగ్ తగిలించారు. తీరా వారు పెట్టిన ఖ‌ర్చుకు ప్ర‌తిఫ‌లం ద‌క్క‌కుండానే వారి ప్రకటన న‌వ్వుల పాల‌యింది.

తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అన్న చందాన వారు అంత‌గనం ఖ‌ర్చు చేసి చేసిన ప్ర‌చారం రెండు రోజుల‌కే ఉసూరుమ‌నిపించింది. తాజాగా ప్ర‌క‌టించిన రేటింగ్స్‌లో పోటీ ఛాన‌ల్ ఫ‌స్ట్ ప్లేస్ సాధించింది. దీంతో ఇప్పుడు ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండ్ అవుతున్న‌ది. ప్ర‌తి వారం మారే ర్యాంకింగ్స్ కోసం మ‌రి ఇంత‌లా పోటీ ప‌డి ప‌రువు తీసుకోవాలా అంటు స‌ద‌రు ఛాన‌ల్‌పై నెటిజ‌న్లు, సామాన్యులు సెటైర్లు వేస్తున్నారు. వారిలో వారికే ఆరోగ్యకరమైన పోటీ లేనప్పుడు ఎదుటి వారికి నీతులు చెప్పడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.

పైగా ఆ ప్రకటన చూసిన కాసేప‌టికి గానీ ఆర్థం కాదు ఎవ‌రినీ ఉద్దేశించి ఆ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ని. ఆ ప్ర‌క‌ట‌న‌లు అవ‌త‌లి ఛాన‌ల్‌ను విమ‌ర్శించిన‌ట్లు కాకుండా వారి ఛాన‌ల్ గురించి వారే తిట్టుకున్నట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. చివరకు వారిచ్చుకున్న ప్రకటన ‘కుట్రతో No 1 ఎప్పటికీ కాలేరు’ అన్న వారి మాటలే నిజం అయ్యాయి.