విధాత: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా రూపొందిన చిత్రం ‘వారీసు’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తెలుగులో కూడా ‘వారసుడు’గా విడుదలైంది.
కానీ ఈ చిత్రం చూసిన వారు గతంలో త్రివిక్రమ్ తీసిన ‘అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో, నవదీప్ నటించిన గౌతమ్ ఎస్ఎస్‌సి’ వంటి చిత్రాలను పోలివుందని, ఇది ఒక డైలీ సీరియల్‌లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద పర్లేదు అనిపిస్తున్న ఈ చిత్రం లాంగ్ రన్‌లో తెలుగుతో పాటు తమిళంలో కూడా నష్టాలను మూట కట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు, ట్రోల్స్‌కు వంశీ పైడిపల్లి సమాధానం చెప్పాడు.
డైలీ సీరియల్‌లతో పోల్చి తక్కువగా చూడకండి. డైలీ సీరియల్ కూడా తక్కువేమీ కాదు. అది కూడా ఒక క్రియేటివ్ వర్క్. సాయంకాలమైతే ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ టీవీలకు అతుక్కుపోతారన్న విషయం గుర్తుంచుకోండి.
మరి ఇంత నెగెటివిటీ మంచిది కాదు. ఇది మనిషిని కృంగ తీస్తుంది. పక్క వారిని కిందకు లాగాలనుకుంటే మనం మరింత కిందకు దిగజారుతాం. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ దాన్ని వదిలేసి డైరెక్టర్‌గా మారాను. సినిమా అనేది చిన్న విషయం కాదు. సినిమా తీయడం ఒక సృజనాత్మక కళ. ఇక నటన కూడా అంతే.
విజయ్ సార్ తాను చేసే డ్యాన్సులు.. చెప్పే డైలాగుల కోసం ఎంతగా రిహార్సల్స్ చేస్తారో మీకు తెలియదు. ఆ కష్టం మీకు తెలియదు. ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. విజయ్ నా సినిమాలకు సమీక్షకుడు. ఆయన కోసం సినిమా తీశా.
నేనొక కమర్షియల్ సినిమా తీశాను. అంతేగాని ఓ అద్భుతమైన సినిమాను తీశానని చెప్పడం లేదు. ప్రేక్షకులను ఎంటర్ చేయడానికి మూవీ చేశాను. వారీసు అలాగే అలరిస్తోంది అని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.
అయినా ప్రేక్షకులకు కావాల్సింది సినిమా మేకర్స్ పడే కష్టం కాదు. తాము ఎంతో కష్టపడి సంపాదించి, సినిమాకి ఖర్చు పెట్టిన మొత్తానికి తగిన ప్రతిఫలం.. ఎంజాయ్‌మెంట్. ఒక్క సినిమాలలోనే కాదు.. ఏరంగంలో అయినా సృజనాత్మకత, కష్టం దాగి ఉంటాయనే విషయం వంశీ పైడిపల్లికి తెలియదేమో.