Volunteers |
విధాత: వలంటీర్ల మీద చంద్రబాబు, లోకేష్ యుద్ధం ప్రకటించి వారిని ప్రజాకోర్టులో నిందితులుగా నిలబెట్టి, వారి పరువు తీసి, జగన్ కు జనంలో ఉన్న బలం.. సత్తాను తగ్గించేందుకు టిడిపి జనసేన గట్టిగానే కృషి చేస్తున్నాయి. మేము వస్తే వలంటీర్లను కొనసాగిస్తాం అని చెప్పిన చంద్రబాబు కూడా మళ్ళీ నిన్న వాలంటీర్లు అరాచక శక్తులు.. వ్యక్తిగత, కుటుంబ వివరాలు అడుగుతున్నారు అంటూ చంద్రబాబు నాలుక మడతేశారు.
ఇక పవన్ ఐతే వలంటీర్ల వెన్ను విరుస్తా అంటున్నారు. మొత్తానికి ఇది జగన్ కు ప్రతిపక్షానికి జరుగుతున్న వివాదంలా లేదు.. ఏకంగా రెండున్నర లక్షల వలంటీర్లకు పవన్ కళ్యాణ్ కు మధ్య జరుగుతున్న వార్ మాదిరి సాగుతోంది. అయితే ఇప్పుడు వలంటీర్ల మీద సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉంది, వారి సేవలు ఎలా ఉన్నాయి .. వారు ఎలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు.. జనం ఏమనుకుంటున్నారు.. వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పల్లెల్లో దాదాపు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా నగరాల్లో 70-100 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లారగానే పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్లు అందిస్తున్నారు. ఈ రకంగా వాళ్ళు పేదలు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు దగ్గరయ్యారు. దీంతో వాళ్ళ మద్దతుతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ఎత్తులు వేస్తున్నారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో వాలంటీర్ల మీద గట్టిగా దెబ్బ కొట్టడం ద్వారా జగన్ నైతిక స్థైర్యాన్ని దిగజార్చాలని చంద్రబాబు.. పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ధర్నాలు చేస్తూ పవన్ తీరుకు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ ఐతే ఏకంగా జగన్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ యువత దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇవన్నీ ఎందుకులే అని భావించిన ప్రభుత్వం ఇక ఇప్పుడు వాలంటీర్ల సేవలు ఉండాలా వద్దా అనే ప్రజాభిప్రాయం కనుక్కునేందుకు సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన నియోజకవర్గంలో ఈ సర్వే త్వరలో ప్రారంభిస్తాం అన్నారు.. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే చేసి.. వలంటీర్ల పనితీరు పై తుది ఫలితం వెల్లడిస్తారని అంటున్నారు.