తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజలంతా తమ ఓటు హక్కును తెలంగాణకు మార్చుకోవాలని , ఆంధ్రలో ఏమీ లేదు.. తెలంగాణకు ఆంధ్రకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు ఆ జోరును కొనసాగిస్తున్నారు. నిన్న ఏదో యథాలాపంగా మాట్లాడినట్లు లేదు.. కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. నిన్నటి వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఈరోజు కూడా ఆయన మాటల వాడి.. వేడి కొనసాగించారు.
ఈరోజు ఏమన్నారంటే తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు? ‘ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి.. మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిది’ అంటూ హెచ్చరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మీ దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు. ఏముందో వచ్చి చూడండి.
మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. ఇప్పుడేమో అడగరు. హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరు..
విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును అమ్మినా ఎవ్వరూ నోరెత్తరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి అని ఆరోపించారు. ఇదిలా ఉండగా హరీష్ రావు మాటలకు ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వర రావు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఆయన ‘హరీశ్‌రావు.. దౌర్బాగ్యమైన మాటలు మాట్లాడకు. ఏపీకి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా..? మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్లు తేడా చూసుకో.. మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు.. మా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తేడా చూస్కో.. జీడీపీలో మేం దేశంలోనే నెంబర్ వన్‌లో ఉన్నాం. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో..’ అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి కానీ ఇలా మాటల యుద్ధం నడిస్తే ప్రజల మధ్య కూడా విభేదాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.