Warangal | ప్రధానికి చట్టాలంటే గౌరవం లేదు.. ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ లేదు: వినయ్‌భాస్కర్
Warangal ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర మోడీది బిజెపిది ప్రజా వంచన పాలన అభివృద్ధిపై బీజేపీ చర్చకు సిద్ధమా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత వారం రోజులుగా వరంగల్‌లో బిజెపి చేస్తున్న హడావుడి చూసి ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తే మరోసారి వంచన చేశారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి చట్టాలపై గౌరవం లేదని, ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ […]

Warangal
- ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర మోడీది
- బిజెపిది ప్రజా వంచన పాలన
- అభివృద్ధిపై బీజేపీ చర్చకు సిద్ధమా
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత వారం రోజులుగా వరంగల్‌లో బిజెపి చేస్తున్న హడావుడి చూసి ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తే మరోసారి వంచన చేశారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి చట్టాలపై గౌరవం లేదని, ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ లేదని విమర్శించారు. అమ్మవారు భద్రకాళి పేరు తీసుకుని ప్రధాని మోడీ అపవిత్రమైన మాటలు మాట్లాడారు. భద్రకాళి శాపం కచ్చితంగా బీజేపీకి తగులుతుందన్నారు.
హనుమకొండలో శనివారం మేయర్ గుండు సుధారాణి ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి మోడీ పర్యటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన జిల్లాకు చెందిన మూడు హామీలైన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రధాని పర్యటన సందర్భంగా ప్రకటిస్తారని ఆశపడ్డామని, నిరాశే మిగిల్చిందని అన్నారు.
నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరుతుంది అనుకుంటే తుస్సు మనిపించారని విమర్శించారు. విభజన హామీలలో ఒకటైన కోచ్ ఫ్యాక్టరీ పై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నిస్తే, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలత లేదని, దేశంలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం లేదని ప్రధాని చెప్పారని వినయ్ వివరించారు.
కొద్ది నెలలకే మహారాష్ట్ర, తర్వాత గుజరాత్లో ఎన్నికలు వస్తే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలను ముఖ్యంగా వరంగల్ ప్రజలను వంచనచేయడం కాదా అంటూ ప్రశ్నించారు. చట్టాలపట్ల గౌరవం లేని ప్రధానమంత్రిగా మోడీ నిలిచిపోయారని విమర్శించారు.
కోచ్ తో 30వేల ఉద్యోగాలు
520 కొట్లతో వాగన్ ఫ్యాక్టరీ వస్తుంది. గుజరాత్‌లో 20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి తెలంగాణ వచ్చేసరికి ముష్టి 500 కోట్లా అంటూ వినయ్ ప్రశ్నించారు. వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తే మూడు వేలు ఉద్యోగాలు వస్తాయన్న మోదీ తాను తరలించుకుపోయిన కోచ్ ఫ్యాక్టరీకి 30 వేల ఉద్యోగాలు వస్తాయి. మరి తెలంగాణ యువతకు ఉద్యోగాలు వద్దా మోదీ సమాధానం చెప్పాలన్నారు.
దేశాన్ని పెట్టుబడి దారులకు దోచిపెడుతున్న మోదీ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. బీజేపీ కుటుంబ పాలన గురించి మాట్లాడడం వింతగా ఉంది. ఇప్పుడు బీజేపీలో కుటుంబ సభ్యులు అధికారంలో లేరా? అంటూ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో శివసేన , ncp లను చీల్చినట్టు బీ ఆర్ ఎస్ ను చీల్చలేక పోయారనే అసహనంతో మోడీ మాట్లాడారని మండిపడ్డారు. ప్రభుత్వాలను పడగొట్టి, ప్రజా ప్రభుత్వాలను చీల్చే ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం, ప్రజల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
దేశ ప్రజలను అవినీతి లేని పాలన, ఒక్కొక్కరికి రూ.15 లక్షలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన మోదీ దేశ ప్రజలను మోసం చేసిన మోసగాడు అంటూ విమర్శించారు.
యూనివర్సిటీ స్కాలర్స్‌కు ఇచ్చే ఉపకార వేతనాలను తగ్గించి, నిధులను కోత పెట్టి, రద్దు చేసిన మోదీ యూనివర్సిటీల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా
తెలంగాణలో కేసీఆర్ పాలనపై ప్రధాని మోడీ విమర్శలు చేశారని, రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై బిజెపి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వినయ్‌భాస్కర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్‌గా ఆవిర్భవించినప్పటి నుంచి బిజెపి వెన్నులో వణుకు పుడుతుందని విమర్శించారు. అవినీతి పేరుతో ఈడిని ప్రయోగించాలని కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు.
కెసిఆర్ ను కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు త్వరలో కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.