విధాత: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఓ ఇరవై.. పాతిక సీట్లిచ్చి లొంగదీసేద్దాం అనే ఆలోచనలో ఉన్న టీడీపీ (TDP)కి జనసేన (Janasena) పవన్ (Pawan) ఇప్పుడు కొరుకుడు పడేలా కనిపించడం లేదు.. నన్ను అంత వీజీగా ఫిక్స్ చేయలేరు. నా రేంజి వేరే అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు.
నిన్న మంగళగిరి (mangalagiri)లో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సదస్సులో కొందరు బీసీ (BC) ప్రతినిధులు కూడా పవన్‌ను సొంతంగా పోటీ చేయాలని, వేరే పార్టీతో పొత్తులు వద్దని బహిరంగంగా చెప్పడంతో పవన్ కాస్త గట్టిబడినట్లు.. వేరే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన మాట తీరు మారిందని అంటున్నారు.
కాపులు తలెత్తుకునేలా తన రాజకీయం ఉంటుంది తప్ప తాను ఎవరితోనూ ఒప్పందాలు కానీ డీలింగ్స్ కానీ పెట్టుకునే సమస్య లేదని పవన్ అంటున్నారు. వేయి కోట్ల రూపాయలతో ఒక పార్టీలో డీలింగ్ జనసేనకు కుదిరింది అంటున్నారని వేయి కోట్లు ఉంటే రాజకీయం చేయగలమా అని పవన్ ప్రశ్నించారు. అసలు రాజకీయాల్లో కావాల్సింది సిద్ధాంత బలం అని ఆయన అన్నారు. దాన్ని తాను నమ్ముతాను అని ఆయన స్పష్టం చేశారు.
తనది నిర్మొహమాటంతో కూడుకున్న మనస్తత్వం అని అదే తన రక్తమని ఆయన అన్నారు. తాను వెనక్కి తగ్గే సీన్ లేదని ఎవరు ఏమి చెప్పినా తాను పార్టీ పెట్టింది ప్రజలకు మేలు చేయడానికి, సమాజంలో మార్పు కోసమని ఆయన అన్నారు. జనసేన రాజకీయ ప్రయాణంలో పదేళ్ళు పూర్తి అయ్యాయంటే ఆశ్చర్యం వేస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ పదేళ్ళూ ప్రతికూల పరిస్థితుల మధ్యనే రాజకీయం సాగిందని ఆయన గుర్తు చేశారు.
ఎన్నో అవమానాలు మాటాలు పడ్డామని అయినా రాజకీయాల్లో ఉంటున్నామంటే అది కేవలం ప్రజలకు మేలు చేయాలన్న తపన తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. తాను ఏదో పదవులను ఆశించి రాజకీయాల్లోకి రాలేదని గాజువాక భీమవరంలో ఓడిపోయినా తాను బాధపడలేదని ఓటమిని కూడా తాను పాజిటివ్‌గా తీసుకుంటానని ఆయన చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ ఇరవై సీట్లు ఇస్తుంది అన్న ప్రచారం మీద పవన్ (Pawan Kalyan) కాపుల ఆత్మగౌరవం తగ్గించను అని చెప్పిన మాటలతో ఇప్పుడు చర్చ సాగుతోంది. అంటే అంత తక్కువ సీట్లు ఇస్తే పొత్తు ఉండదని ఆయన చెప్పదలచుకున్నారా లేక ఆధికార వాటాతోనే కాపుల ఆత్మగౌరవం నిలబడుతుందని కాపు నాయకులు కోరుతున్న తీరున ఆయన కూడా అలాంటి డిమాండే పొత్తుల విషయంలో చేయదలచుకున్నారా అన్నదే ఇపుడు చర్చనీయాశంగా ఉంది.