MLC Election Results |
విధాత: జగన్(Jagan)కు ఊహించని దెబ్బ.. టీడీపీ వాళ్ళు వెక్కిరిస్తున్నచోటే తానూ కాలు జారీ పడిన అవమానం.. నిస్సత్తువగా నిద్దరోతున్న టీడీపీ (TDP)కి ఆక్సిజన్ అందించి మేల్కొలిపిన గెలుపు ఇది. శాసనమండలి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) గెలవడం వైసీపీకి మింగుడు పాడడం లేదు. గెలుపు సంగతి అలా ఉంచితే తన పార్టీ నుంచి ఇద్దరు వెళ్లి అటు టీడీపీకి ఓటేయడం జగన్ను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. జగన్ అంటే ప్రాణం ఇష్టం అని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇలా వెన్నుపోటు పొడవడం జగన్ను మరింత బాధిస్తోంది.
ఇంతకూ టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు హార్డ్ కొర్ జగన్ ఎమ్మెలేలు ఎవరు.. జగన్ పార్టీ ఇంటలిజెన్స్ వారి వివరాల ప్రకారం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (MLA Mekapati Chandrasekhar Reddy) ఒకరు కాగా ఇంకొకరు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి (MLA Sridevi). వాస్తవానికి జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తరుణంలో జగన్ వెంట నిలిచింది నెల్లూరు నుంచి మేకపాటి కుటుంబం మాత్రమే. సీనియర్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన సోదరుడు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ జగన్ వెంట నడిచారు.
అయితే మొన్నటి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చంద్రశేఖర్ రెడ్డి మంత్రి పదవిని ఆశించగా అది కాస్తా విద్యావంతుడు, జగన్‌కు సన్నిహితుడు అయినా మేకపాటి గౌతమ్ రెడ్డికి (రాజమోహన్ రెడ్డి కుమారుడు) కు దక్కింది. అప్పట్నుచి పార్టీకి దూరంగా అసంతృప్తితో ఉంటూ వస్తున్నా రాజమోహన్ రెడ్డి తీరు జగన్ కు కోపం తెప్పించింది.
ఇంకా ఆయన ఎన్నికల్లో గెలవడం కూడా కష్టం అని సర్వేల్లో తేలడంతో ఉదయగిరి ఇంకో కొత్త ఇంచార్జ్‌ను నియమించి జగన్ పార్టీ బలోపేతానికి మార్గం వేశారు. ఈ నిర్ణయం చంద్రశేఖర్ రెడ్డిలో ఆగ్రహాన్ని పెంచింది. తనకు రానున్న ఎన్నోకల్లో టికెట్ రాదనీ గ్రహించి ఇప్పుడు టీడీపీకి ఓటేసినట్లు భావిస్తున్నారు.
ఇక తాడికొండ శ్రీదేవి హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఉంటూ అనూహ్యంగా మొన్న ఎమ్మెల్యే అయ్యారు. ఆమె అందుబాటులో లేకపోవడం, జనాల్లో ఇమేజ్ లేకపోవడంతో అక్కడ కూడా ఇంకో సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఇంచార్జ్‌గా వేశారు. దీంతో ఆమెకు కూడా భవిష్యత్ అర్థమై ఇలా బయటపడ్డారని అంటున్నారు.
వీరిద్దరూ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో వారిడ్డారు క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ కన్ఫామ్ చేసుకుంటోంది. ఇదిలా ఉండగా ఇంకో ఇద్దరు ఎవరన్నా దానిమీద ఊహాగానాలు వస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఇద్దరికీ టికెట్స్ దక్కేది కష్టమే అని పార్టీ చెప్పడంతో బహుశా ఆ ఇద్దరు కూడా క్రాస్ ఓటింగ్ చేసినట్లు పార్టీ అనుమానిస్తోంది.
కాగా సమావేశాలకు చివరిరోజయిన శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు (Assembly Meetings) హాజరు కాలేదు. తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరిలో తన ఇంటి ముందు వైఎస్సార్సీపీ కండువాతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలిసింది.