విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతున్నది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి మాకు ఏం సంబంధం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మొదలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాకా ప్రభుత్వ తీరును విమర్శించారు. ఫాంహౌజ్ ఉదంతమంతా కేసీఆర్ అల్లిన కట్టుకథ అని కొట్టి పారేశారు.
ఈ కేసుకు సంబంధించి మొదట ఆడియో, తర్వాత వీడియోలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ కేసు దర్యాప్తు ప్రక్రియను బీజేపీ నేతలు మొదటి నుంచి అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేక అనుమాలకు తావిస్తున్నది. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణ వీడియోల్లో బీజేపీకి చెందిన జాతీయ నేతల పేర్లు ప్రస్తావించారు. రాష్ట్ర నేతలకు అంత సీన్ లేదని తేల్చేశారు.
అయితే ఈ కేసు విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేయకుండా బీజేపీ నేతలు వేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చింది. తాజాగా స్టే ఎత్తివేసి దర్యాప్తు చేయకుండా ఎక్కువకాలం ఆపలేమని పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని 7 గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది నిందితులను విచారిస్తున్నది. ఈ కేసులో కీలకమైన ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సుప్రీంకోర్టు కూడా భీమాకోరేగాం కేసు విచారణ సందర్భంగా అవినీతిపై కీలకవ్యాఖ్యలు చేసింది. ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుపై తక్షణం స్టే విధించి.. కేసును సీబీఐకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతున్నది.
అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్నా వాళ్లేమీ దర్యాప్తును అడ్డుకోవడం లేదు. కానీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అడ్డంగా దొరికిన నిందులను విచారించకుండా బీజేపీ నేతలు స్టే విధించాలని పిటిషన్లు దాఖలు చేయడం పట్ల వివాదాస్పదం అవుతున్నది. బీజేపీ నేతల తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది