TPCC Chief Mahesh Kumar Goud| సినీ తారల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది?: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

TPCC Chief Mahesh Kumar Goud| సినీ తారల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది?: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
  • కేసీఆర్, కేటీఆర్ కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ఛాన్స్ లేదు
  • నాయకుల ఫోన్లే కాదు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు
  • సిట్ అధికారులు అన్ని విషయాలను ప్రజలకు బహిర్గతం చేయాలి

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రజలకు సిట్ అధికారులు అన్ని విషయాలను బహిర్గతం చేయాలని..స్వతంత్ర్య భారత దేశంలోనే ఇది అతి పెద్ద నేరమని పీసీసీ చీప్ బి.మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల దాడికి గురైన మహాన్యూస్ చానల్ ఆఫీస్ ను ఆదివారం ఆయన సందర్శించారు. మహాన్యూస్ ఎండీ వంశీ, సిబ్బందిని అడిగి దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులు, అధికారుల వరకే కాకుండా సినీతారలు, జర్నలిస్టులు, జడ్జిలు, మహిళా ఐఏఎస్ ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్నారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగదన్నారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైన అనాటి సీఎం, మంత్రిగా ఉన్న కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు స్పందించడం లేదన్నారు.

రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వంటి నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ చేశారని..వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆ హక్కును వారికి ఎవరిచ్చారన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు రావాలని..బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. పదేళ్లు సీఎంగా ఉన్న మీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ మీడియా నిత్యం మా కాంగ్రెస్ ప్రభుత్వంపైన, నాయకులపైన అనుచిత విమర్శలు చేస్తుందని..అయినా అధికారంలో ఉండి కూడా మేం ఎక్కడా మీలాగ దాడులకు పాల్పడలేదని..పోలీస్ వ్యవస్థకు ఫిర్యాదు వరకే పరిమితమయ్యమన్నారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేటీఆర్ అహంకారంతో, బెదిరింపు దోరణితో అల్లరి మూకలను రెచ్చగొట్టి భౌతిక దాడులకు పురిగొల్పడం మంచిదికాదన్నారు. మీకు ఇబ్బంది అయితే ఫిర్యాదు చేసేందుకు అనేక ప్రజాస్వామిక, రాజ్యాంగ, న్యాయ, చట్టపరమైన వేదికలున్నాయన్నారు. మీడియా సమాజంలో మంచి చెడును ప్రజలకు చెబుతుందని..మీడియాపై దాడుల సంస్కృతి మంచిది కాదని..తాము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.