BRS | ఎమ్మెల్యే నరేందర్ ఆశ ఫలించేనా?.. అభ్యర్థిత్వంపై KTR స్పందించేనా!

BRS | మోకాలొడ్డుతున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యేపై ఇతర నాయకుల తీవ్ర అసంతృప్తి ఆసక్తి రేపుతోన్న ఆశావహుల ప్రయత్నం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆశ ఫలిస్తుందా? లేకుంటే అసమ్మతి నేతల ప్రయత్నం సక్సెస్ అవుతుందా? అనే చర్చ వరంగల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ శనివారం వరంగల్ తూర్పులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా […]

  • Publish Date - June 17, 2023 / 01:14 AM IST

BRS |

  • మోకాలొడ్డుతున్న అసమ్మతి నేతలు
  • ఎమ్మెల్యేపై ఇతర నాయకుల తీవ్ర అసంతృప్తి
  • ఆసక్తి రేపుతోన్న ఆశావహుల ప్రయత్నం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆశ ఫలిస్తుందా? లేకుంటే అసమ్మతి నేతల ప్రయత్నం సక్సెస్ అవుతుందా? అనే చర్చ వరంగల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ శనివారం వరంగల్ తూర్పులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.

శనివారం సాయంత్రం వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ సభలో కేటీఆర్ నన్నపునేనికి మరోసారి పోటీ అవకాశం కల్పిస్తారా? ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటన చేస్తారా? లేదా? అనేది గులాబీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

కేటీఆర్ రాజముద్రపై ఆసక్తి

ఇటీవల కేటీఆర్ నియోజకవర్గాల పర్యటన సందర్భంగా కొన్నిచోట్ల అభ్యర్థులకు మరోసారి పోటీకి అవకాశం కల్పిస్తున్నట్టు పరోక్షంగా అధికారిక ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూపాలపల్లి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాస్యం వినయభాస్కర్‌ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ చెప్పారు. ఈ మాటల వెనుక అంతరార్థం వారికి వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తుందని చెప్పడమే. యువరాజు రాజముద్ర వేయడంతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకుల చర్చకు పుల్ స్టాప్ పెడుతున్నారు.

భూపాలపల్లిలో చారి వర్గం నిరసన

భూపాలపల్లి ఎమ్మెల్యే ప్రకటన విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్, మాజీ భూపాల్ పల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నుంచి మరోసారి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. బహిరంగ సభలో కేటీఆర్ గండ్ర వెంకటరమణారెడ్డిని పొగుడుతున్న సందర్భంలో కూడా చారి వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ విషయం అధినేత కేసిఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు చర్చ సాగుతోంది.

కొన్నిచోట్ల కేటీఆర్ సైలెన్స్

ఈ సంఘటన అనంతరం కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించగా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ప్రకటన చేయకుండా కేటీఆర్ మిన్నకుంటున్నారు. ముందుగానే అభ్యర్థుల ప్రకటనతో నియోజకవర్గాలలో సమస్యలు తలెత్తుతున్నాయని భావించిన అధిష్టానం ఈ మేరకు కేటీఆర్ ను నియంత్రించినట్లు సమాచారం.

కేటీఆర్ స్పందన పై తూర్పులో ఆసక్తి

వరంగల్ తూర్పులో జరిగే సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిత్వానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేకుంటే ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఊరుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా కేటీఆర్ ఎమ్మెల్యేల అభ్యర్థి ప్రకటన నేపథ్యంలో పార్టీలో అలజడి నెలకొంటున్నది. ఇదే విషయాన్ని అధినేత కేసిఆర్ దృష్టికి కొంతమంది సీనియర్ నాయకులు అభ్యర్థుల ప్రకటనను నిలిపివేయాలంటూ సూచించినట్లు సమాచారం.

అసమ్మతి వర్గం అడ్డుకుంటుందా?

ఈ నేపథ్యంలోనే వరంగల్ తూర్పులో సైతం మంత్రి కేటీఆర్ అనుచరుడుగా చెప్పుకునే నల్లపునేని నరేందర్ పేరును ప్రకటిస్తారని భావించిన అసమ్మతి నాయకులు కొందరు అంతర్గతంగా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు అధినేతకు తమ ఆవేదనను తెలియజేసినట్లు తెలుస్తోంది. నరేందర్ పేరు ప్రకటించకుండా కేటీఆర్ ను కట్టడి చేయాలంటూ, ఎన్నికల నాటికి పరిస్థితిని చూసుకోవచ్చని, ప్రస్తుతానికి పేరు ప్రకటన నిలిపివేయాలంటూ కోరినట్లు తెలిసింది.

వీటన్నింటిని పట్టించుకోకుండా కేటీఆర్ నన్నపనేని నరేందర్ పేరును ప్రకటిస్తారా? లేకుంటే అసమ్మతి చేసిన ప్రయత్నాలు మేరకు ఆగిపోతారా? లేకుంటే తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పేర్ల ప్రకటన నిలిపివేయాలని అధిష్టానం ఆలోచన మేరకు నడుచుకుంటారా? అనేది శనివారం సాయంత్రానికి తేలనుంది.

ఏడాది ముందే ఎన్నికల వాతావరణం

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అసెంబ్లీ సెగ్మెంట్​లో అధికార పార్టీ నేతల హడావుడి పెరిగింది. దీంతో పాటు ఆశావహులు సైతం తమ కార్యకలాపాలకు పదునుపెట్టారు. నియోజకవర్గంలో ఈ పోటీ తీవ్రమైంది. అధినేత కేసీఆర్​ సూచన మేరకు ఎమ్మెల్యే పార్టీ కార్యకలాపాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే తమ వంతు ప్రయత్నం చేస్తుండగా ఎమ్మెల్యే పై అసంతృప్తితో ఉన్న నాయకులు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. ఇంతకాలం కేవలం తమ అనుచరులకే పరిమితమైన నాయకులు తాజాగా ప్రజల్లోకి వెళుతున్నందున గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి.