వీడేం కొడుకు.. కాలీఫ్లవర్ తెంపిందని తల్లిని కట్టేసి కొట్టాడు..
వృద్ధురాలైన తన తల్లికి కడుపు నిండా భోజనం పెట్టాల్సిన ఓ కుమారుడు కర్కశంగా ప్రవర్తించాడు

భువనేశ్వర్ : వృద్ధురాలైన తన తల్లికి కడుపు నిండా భోజనం పెట్టాల్సిన ఓ కుమారుడు కర్కశంగా ప్రవర్తించాడు. ఎలాంటి అనుమతి లేకుండా తన పొలంలో కాలీఫ్లవర్ ఎలా తెంపుతావని ప్రశ్నిస్తూ, తల్లిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించాడు. ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కియోంజర్ జిల్లాలోని సరసపాసి గ్రామంలో ఓ 70 ఏండ్ల వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె కుమారులు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. వ్యవసాయ పొలాలు కూడా పంచింది వృద్ధురాలు. అయితే చిన్న కుమారుడు తన పొలంలో కాలీఫ్లవర్ పెంచాడు. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన వృద్ధురాలు.. కుమారుడి పొలంలో నుంచి ఓ కాలీఫ్లవర్ తెంచి ఇంటికి తీసుకొచ్చింది.
దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుమారుడు, తల్లిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. అడ్డుకోబోయిన స్థానికులను బెదిరించాడు. అయినప్పటికీ ఆమెను ఆ మూర్ఖుడి నుంచి రక్షించారు. అనంతరం బసుదేవ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.