Sweet Potato : చిలగడదుంప ఉడికించి తింటే మంచిదా..? కాల్చి తింటే మంచిదా..?

చిలగడదుంపను ఉడికించి తింటే మంచిదా? కాల్చి తింటేనా? షుగర్ ఉన్నవారు ఎలా తీసుకోవాలి? తొక్క తీసేసి తింటే వచ్చే నష్టం ఏంటి? పోషకాహార నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాలివే.

Sweet Potato : చిలగడదుంప ఉడికించి తింటే మంచిదా..? కాల్చి తింటే మంచిదా..?

చిలగడదుంపలు (sweet potato) వీటి గురించి తెలియని వారు ఉండరు. వర్షాకాలంలో విరివిగా దొరికే స్వీట్‌ పొటాటోను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. ఉపవాస సమయంలో వాటిని తినడం వల్ల బలహీనత, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. చిలగడదుంపల్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.

షుగర్ లెవెల్స్ అదుపులో..

చిలగడ దుంపల్లో విటమిన్ ఎ, సి, బి6, ఇ, పొటాషియం, మాంగనీస్‌, పీచు పదార్థాలు (Fiber) పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటూ.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. పెద్దపేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చలికాలంలో శరీరానికి అవసరమైన శక్తిని, వెచ్చదనాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇందులో ఉండే ఎ, సితో చర్మం తాజాగా ఉంటుంది. కళ్ల సంబంధిత సమస్యలూ దరిచేరవు. ఇది కండరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులకు కూడా ఇది మంచి ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. చిలగడదుంపలో ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI), ఫైబర్.. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

బరువు అదుపులో..

బరువు తగ్గాలనుకునే వాళ్లకు చిలగడదుంప బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తేలికగా కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. వీటిల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదపులోకి తీసుకొస్తాయి. గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. ఈ స్వీట్‌ పొటాటో తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఉడికించి తింటే మంచిదా..? కాల్చిన చిలగడ తింటే మంచిదా..?

కొందరు చిలగడదుంపను ఉడకబెట్టి తీసుకుంటారు. మరికొందరు కాల్చిన దుంప తినేందుకు ఇష్టపడతారు. అయితే, ఎలా తింటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో చాలా మందికి తెలియదు. ఉడకబెట్టిన చిలగడ చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉడికించినప్పుడు అందులోని కొన్ని చక్కెరలు నీటిలో కలిసిపోతాయి. ఫలితంగా అందులోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (Glycemic Index) తగ్గుతుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాదు, ఉడికించిన చిలగడ సులభంగా అరుగుతుంది. కడుపుకు కూడా హాయిగా ఉంటుంది.

ఇక కాల్చిన దుంప విషయానికొస్తే.. అది కూడా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే, వేయించేటప్పుడు ఆరోగ్యకరమైన నూనెలు వాడాలని సూచిస్తున్నారు. కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ లేదా అవకాడో ఆయిల్‌తో రోస్ట్‌ చేసి తింటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయని చెబుతున్నారు. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.

తొక్కతో సహా తినొచ్చా..?

చాలా మంది చిలగడదుంపను తొక్క తీసేసి తింటారు. దీని వల్ల కొన్ని పోషకాలు కోల్పోతామట. తొక్కతోపాటూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలగడదుంప తొక్కలో అదనపు ఫైబర్‌ (పీచు పదార్థం), పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించినదైనా, వేయించినదైనా తొక్కతో తింటే మంచిదని సూచిస్తున్నారు. దీని వల్ల మీ శరీరానికి మరింత పోషక విలువలు అందుతాయి. అయితే, ముందే దీన్ని శుభ్రంగా కడగడం మాత్రం మర్చిపోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Bill Gates : బిల్‌గేట్స్‌కు సెక్సువల్‌ డిసీజ్‌.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు
Raithu Bharosa | ’రైతు భరోసా‘ విడుదల ఇంకెప్పుడు? 10 లక్షల మందికి కట్?