కారును ఖతంచేసి కమలాన్ని బతికించి..
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, తాను అందులో చక్రం తిప్పబోతున్నానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. మరో అడుగు ముందుకేసి.. ప్రధాని పదవి చేపట్టేందుకు ఆఫర్ వస్తే.. ఎందుకు వదులుకుంటాననీ ప్రశ్నించారు.

బీఆరెస్‌కు భారీగా తగ్గిన ఓట్లు
వాటితోనే బలం పుంజుకున్న బీజేపీ
ప్రమాదకర రాజకీయాల్లోకి రాష్ట్రం
కాంగ్రెస్‌పై కోపంతో రాష్ట్రానికి అ న్యాయం
బీఆరెస్ తీరుపై ప్రగతిశీల శక్తుల ఆగ్రహం
విధాత ప్రత్యేకం: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, తాను అందులో చక్రం తిప్పబోతున్నానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. మరో అడుగు ముందుకేసి.. ప్రధాని పదవి చేపట్టేందుకు ఆఫర్ వస్తే.. ఎందుకు వదులుకుంటాననీ ప్రశ్నించారు. ఆయన చెప్పినదాంట్లో కొంత వాస్తవరూపం దాల్చింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కానీ.. ఆ సంకీర్ణంలో ప్రధాని పదవి సంగతేమోగానీ.. కనీసం చక్రం తిప్పే భాగ్యం కూడా ఆయనకు దక్కలేదు. ఏ మాత్రం తేడా వచ్చి ఉండినా.. ఎన్డీయే పక్షాల సమావేశంలో మోదీ పక్కనో, నితీశ్ పక్కనో ఆయన కూర్చొని ఉండేవారేమో! నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ చతికిలపడిపోయింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు క్యూకట్టిన సమయంలో పార్టీకి పూర్వవైభవం సంగతి పక్కనపెట్టి.. లోక్‌సభ ఎన్నికల్లో మరింత పరువు కోల్పోకుండా, పార్టీ కార్యకర్తలు, మిగిలిన నాయకుల్లో భరోసా నింపేందుకు ఆయన బస్సు యాత్రలు చేపట్టారు. అయితే.. ఆ యాత్రల్లో జనసమీకరణ బాగానే జరిగిందనిపించినా.. ఈవీఎంలో ఓటరు బటన్ నొక్కే సమయానికి మాత్రం అచ్చిరాలేదు. కనీసం ఒకటి రెండు సీట్లలోనైనా గెలిపించలేక పోయారు.
బీజేపీపై ఆచితూచి విమర్శలు
కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాలనపైనే కేంద్రీకరించి విమర్శలు చేశారు. మధ్యమధ్యలో బీజేపీని విమర్శించినా.. రొటీన్ వ్యాఖ్యలతో ఏదో పేరుకు విమర్శించాం అని సరిపెట్టేశారు. వాస్తవానికి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్దేశించే లోక్‌సభ ఎన్నికల్లో పదేళ్లుగా దేశంలో వివిధ రంగాల విధ్వంసానికి కారణమైన బీజేపీని వదిలిపెట్టి ఆరు నెలల రేవంత్ సర్కారుపై దాడిని ఎక్కుపెట్టడాన్ని ప్రజలు స్వీకరించలేదని ఫలితాలను బట్టి అర్థమవుతున్నది. ఒకవైపు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని పెద్ద ఎత్తున బీజేపీయేతర పార్టీలు ప్రచారం చేస్తుంటే.. ఆయన ఆ జోలికి కూడా పోలేదు. బీజేపీతో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందం కారణంగానే కేసీఆర్ పదునైన విమర్శలు చేయలేదనే అభిప్రాయాలు జనంలో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానాన్ని అయినా నిలబెట్టుకోలేకపోడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. అలాగే ఖమ్మం, మహబూబాబాబాద్ మినహా 14 చోట్ల మూడో స్థానానికి పరిమితం అయింది. కవిత బెయిల్ కోసమే కేసీఆర్ బీజేపీతో రహస్య అవగాహనకు వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దానికి తోడు ఉన్నట్టుండి ఊడిపడిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటికే కుంగిన మేడిగడ్డ.. తలపై భారంగా మారి కూర్చున్నది. వీటిపై దర్యాప్తులు, విచరాణలు కూడా జరుగుతున్నాయి. విచారణల తర్వాత చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే బీఆరెస్ గెలవకపోయినా ఫర్వాలేదు కానీ.. కాంగ్రెస్ గెలవకూడదనే ఉద్దేశంతోనే గులాబీ నాయకత్వం అంతర్గతంగా బీజేపీ గెలుపుకోసం పనిచేసేందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌కు తగ్గిన ఓట్లు, బీజేపీకి పెరిగిన ఓట్లు చూస్తే ఆ విమర్శలకు బలం చేకూరుతున్నది.
బీఆరెస్ ఓట్లన్నీ బీజేపీకే!
2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ నాటికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు, ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకంతా బీజేపీ ఖాతాలోకి చేరిందనేది స్పష్టమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 92,35,792 (39.4 శాతం), బీఆర్‌ఎస్‌కు 87,53,924 (37.35 శాతం), బీజేపీకి 32,57,511 (13.9 శాతం), ఎంఐఎం 5,19,379 (2 .22 శాతం) ఓట్లు వచ్చాయి. ఆరు నెల్లలోనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్లు చూస్తే బీజేపీ ఎవరి వల్ల లబ్ధి పొందింది? బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీం అన్నది నిజమేనా? అన్న అంశంలో చర్చను మరింత రాజేసేలా ఉన్నది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 87,41,263 (40.10 శాతం), బీఆర్‌ఎస్ 36,37,086 (16.68 శాతం), బీజేపీ 76,47,424 (35.8 శాతం), ఎంఐఎం 6,59,278 (3.02 శాతం) ఓట్లు సాధించాయి. ఫలితంగా కాంగ్రెస్ 4,94,529 ఓట్లను కోల్పోగా బీఆర్‌ఎస్ అయితే 30 శాతానికి పైగా కోల్పోయి 51,16,838 ఓట్లే దక్కించుకున్నది. అదే సమయంలో బీజేపీ గణనీయంగా 43,89,913 సాధించింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో బీఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో ఉనికి కోల్పోయి బీజేపీకి ఊపిరి పోసింది. ఎంఐఎం కూడా 1,39 899 ఓట్లు పెరిగాయి. బీజేపీ అభ్యర్థి మాధవీలత హిందూ ఓట్లను సాధించడం కోసం చేసిన ప్రసంగాలు, మసీదులను బాణంతో కూల్చివేస్తామని అన్నట్టు ప్రదర్శించిన హావభావాలు ముస్లిం ఓటర్లు గతంలో కంటే ఎక్కవ సంఖ్యలో ఎంఐఎంకు మళ్లేలా చేశాయి. బీఆర్‌ఎస్ ఇక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలో చాలాచోట్ల బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 2023లోనూ ముస్లిం ఓట్లు నగర పరిధిలో బీఆర్ఎస్‌కు బాగానే పడ్డాయి. కానీ బీఆర్‌ఎస్ కు వేసినా వృథా అనే ఉద్దేశంతో ఆ ఓట్లు కొన్ని బీజేపీకి, కొన్ని కాంగ్రెస్ పార్టీకి మళ్లినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, దాని అభ్యర్థి మాధవీలత చేసిన హడావుడితోనే అసదుద్దీన్ మెజార్టీ గతం కంటే బాగా పెరిగిందని చెబుతున్నారు.
ప్రమాదంలోకి నెట్టిన బీఆరెస్?
కేంద్రంలో బీజేపీ సొంతంగా 240 సీట్లను గెలుచుకున్నది. దానికి కారణం తెలంగాణలో బీఆర్‌ఎస్ అయితే, యూపీలో బీఎస్పీ అనే విమర్శలున్నాయి. ఒకవేళ ఈ పార్టీలు సహకరించకపోతే బీజేపీ బలం 210 వరకే పరిమితమయ్యేదని, మూడోసారి అధికారంలోకి వచ్చే మెజారిటీ ఎన్డీఏ కూటమికి కూడా దక్కపోయేదనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రాల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లతో కొన్ని పార్టీలు తమ పార్టీలను బలిపెట్టి అయినా బీజేపీని గట్టెక్కించాయి అనడానికి ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2018లో ఒక్క సీటుకే పరిమితమై రాష్ట్రంలో మాత్రం బలం లేని బీజేపీని ఇక్కడి దాకా తీసుకొచ్చింది కేసీఆరే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు గుంజుకుని రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేద్దామనే ప్రయత్నంలో ఆ రాజకీయ ఖాళీని భర్తీ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇప్పుడు అదే బీజేపీ.. బీఆరెస్ ఓట్ల పుణ్యమాని రాష్ట్రంలో మరింత బలం పెంచుకున్నది. కాంగ్రెస్‌పై కోపంతో రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయ పరిణామాలకు బీఆరెస్ కారణమైందనే విమర్శలు ప్రగతిశీల శక్తుల నుంచి వినిపిస్తున్నాయి